భారత ‘విద్యుత్‌’కు రూ.655 కోట్ల రుణం

3 Oct, 2017 01:41 IST|Sakshi

ఆమోదం తెలిపిన ఏఐఐబీ, ఏడీబీ

బీజింగ్ ‌: భారత్‌లో విద్యుత్‌ పంపిణీ నష్టాలను తగ్గించడంతో పాటు సౌర, పవన విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించడానికి బీజింగ్‌ కేంద్రంగా పనిచేసే ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ), మనీలాలోని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) రూ.655.63 కోట్ల(100 మిలియన్‌ డాలర్లు) రుణం అందించనున్నట్లు చైనా పత్రిక జిన్జువా తెలిపింది. ఏఐఐబీ, ఏడీబీలు చెరో 50 మిలియన్‌ డాలర్ల చొప్పున ఈ రుణాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ ప్రతిపాదనకు ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది.

ఏఐఐబీ, ఏడీబీలు సంయుక్తంగా రుణాలు జారీచేయడం ఇది నాలుగోసారని వెల్లడించింది. చైనా నేతృత్వంలో దాదాపు 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో 2016లో ఏర్పాటైన ఏఐఐబీలో చైనా 26.06% పెట్టుబడితో మెజారిటీ వాటాదారుగా ఉండగా, భారత్‌ 7.5 శాతంతో రెండో స్థానంలో ఉంది. రష్యా 5.93%, జర్మనీ 4.5శాతం పెట్టుబడితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు