ప్రయాణికుడికి దడ పుట్టిస్తున్న ఓలా

7 Sep, 2016 15:35 IST|Sakshi
ప్రయాణికుడికి దడ పుట్టిస్తున్న ఓలా

ముంబయి: ఈ మధ్య ఓలా క్యాబ్లు ప్రయాణికులకు వణుకుపుట్టిస్తున్నాయి. గుండె దడ వచ్చేలా బిల్లులు వడ్డిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తర్వాతగానీ వాటిని సరిచేసి క్షమాపణలు చెప్పి చేతులు దులిపేసుకునే పరిస్థితి కనిపించడంలేదు. మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి నిజమాబాద్కు వెళ్లిన రతీశ్ శేఖర్ అనే వ్యక్తికి ఓలా క్యాబ్ రూ.9.15లక్షలు బిల్లు వేసింది. ఆయన ప్రయాణించిన కారు 450 కిలోమీటర్లు ఉండగా మీటర్ రీడింగ్ మాత్రం ఏకంగా 85,427కి.మీ అని చూపించింది. అచ్చం ఇదే తరహాలోనే మహారాష్ట్రలో కమల్ బాటియా అనే వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురైంది.

ఓ వివాహ కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి ముంబయి నుంచి పుణెకు వెళ్లిన ఆయనకు మొత్తం రూ.83,395 బిల్లు చూపించింది. 14 గంటల్లో 7 వేల కిలో మీటర్లు ప్రయాణించినట్లుగా ఇన్వాయిస్లో ఇచ్చింది. ఈ బిల్లు చూసిన తొలుత షాకై.. ఆ వెంటనే తేరుకుని డ్రైవర్తో కాసేపు వాదులాడే ప్రయత్నం చేశాడు. అయితే, అది సాఫ్ట్ వేర్ సమస్య అని గుర్తించిన డ్రైవర్ కాల్ సెంటర్కు ఫోన్ చేసి బిల్లు సవరించాడు. క్షమాపణలు చెప్పాడు. చివరకు బాటియా మొత్తం 347 కిలో మీట్లరకు రూ.4,088 చెల్లించి డ్రైవర్కు రూ.100 టిప్ ఇచ్చి వెళ్లాడు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఓలా క్యాబ్లో ఎక్కువగా జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు