మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో దొరికిన సొమ్ము

11 Oct, 2019 17:12 IST|Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. బెంగుళూరు, తుముకూరుతోపాటు 30 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పరమేశ్వరతో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ. 4.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ నేతలు పరమేశ్వర, ఎంపీ ఆర్‌ఎల్‌ జలప్ప ఇళ్లల్లో... తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా అధికారుల బృందం తెలిపింది.  ఈ ఆపరేషన్‌లో 300 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు పాల్గొన్నారు. 

కాగా పరమేశ్వర కుటుంబం దొడ్డబల్లాపురలో సిద్ధార్థ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్సిట్యూట్‌ కళాశాల నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ ఎంపీ జలప్ప కోలార్‌లో ఆర్‌ఎల్‌ జలప్ప ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హత లేని విద్యార్థులకు మెడికల్‌ సీటును రూ. 50-60 లక్షల చొప్పున అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఐటీ అధికారులు దాడులకు దిగగా పెద్ద మొత్తంలో సొమ్ము దొరకటంతోపాటు, అక్కడ లభ్యమైన పత్రాలతో ఆరోపణలు వాస్తవమేనని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అదే విధంగా పరమేశ్వర సోదరుడు ఆనంద్‌ ఇంట్లో, సిద్దార్థ మెడికల్‌ కళాశాలలోనూ నేడు సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు.

ఈ దాడులపై పరమేశ్వరన్‌ స్పందిస్తూ సోదాల పట్ల తనకేమీ అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ జలప్ప మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఐటీ దాడులు తప్పకుండా జరుగుతాయనడానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక్‌ కార్గే విమర్శించారు. మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అది జరగని పని స్పష్టం చేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరమేశ్వర డిప్యూటీ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. జేడీఎస్‌-కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం జూలైలో కుప్పకూలిగా.. యెడ్డీ సీఎంగా బీజేపీ సర్కారు కొలువుదీరింది.

మరిన్ని వార్తలు