సమ్మర్ క్యాంప్ మొదలైంది!

18 May, 2016 10:02 IST|Sakshi
సమ్మర్ క్యాంప్ మొదలైంది!

ప్రతియేటా వేసవిలో ఆర్ఎస్ఎస్ నిర్వహించే ప్రత్యేక ట్రైనింగ్  కార్యక్రమం 'సంఘ్ శిక్షా వర్గ్' సమ్మర్ క్యాంప్ రేషింబాగ్ లో విజయవంతంగా ప్రారంభమైంది. భారత్ పై అవగాహనను, అనుభవాన్ని పెంచుకునే క్యాంప్ గా ఈ కార్యక్రమాన్ని ఆరెస్సెస్ సీనియర్ ప్రచారక్ దత్తాత్రేయ హోసబేల్ అభివర్ణించారు. 25 రోజుల పాటు జరిగే ఈ  శిక్షణా కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలనుంచి  ఎనిమిది వందల మంది యువ స్వయం సేవక్ లు పాల్గొంటున్నారు.

ఆరెస్సెస్ వేసవి శిక్షణా శిబిరంలో వివిధ భాషలు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణలు కలిగిన ఎనిమిది వందలమంది స్వయం సేవక్ లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనుంచి పాల్గొంటున్నారు.  వివిధ వాతావరణాలనుంచి వచ్చి 25 రోజులపాటు కలసి పాల్గొని ప్రత్యేక శిక్షణను పొందే ఈ  శిక్షణా శిబిరం ఓ మినీ భారత్ ను తలపిస్తుంది. అయితే వీరంతా ఇలా కలసి శిక్షణ తీసుకోవడం నిజమైన భారత్ కు అర్థాన్ని చెప్తుందని దత్తాత్రేయ హోసబేల్ అన్నారు. ఆరెస్సెస్ అంటే కేవలం యూనిఫాం, ప్రార్థనలే కాదని,  భిన్నత్వంలో ఏకత్వాన్నిసాధించే ప్రయత్నమని ఆయన తెలిపారు.    

అన్ని ప్రాంతాల ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక్కటిగా కలసి నిర్వహించే కార్యక్రమమే సంఘ్ శిక్షా వర్గ్ అని, దేశంలో మాట్లాడే ప్రతి భాషలోనూ ఆరెస్సెస్ సాహిత్యం అందుబాటులో ఉందని హోసబేల్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఉండే లక్షణాలను, విభిన్న విశేషాలను, వ్యత్యాసాలను తెలుసుకుని భారత్ పై సరైన అవగాన పెంచుకునేందుకు స్వయంసేవక్ లకు ఈ శిక్షణ ప్రోత్సహిస్తుందని విశ్వసంవాద్ కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక సందేశంతో జూన్ 9 న శిక్షణా కార్యక్రమం ముగుస్తుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు