ఆ బంద్‌తో మాకు సంబంధం లేదు : ఆరెస్సెస్‌

30 Jul, 2018 16:29 IST|Sakshi

తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలన్న కేరళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళనలో పాల్గొనడం లేదని రాష్ట్రీయ స్వయం స్వేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) స్పష్టం చేసింది. మహిళలను ఆలయంలోని రాకుండా ఆడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 30న (సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని సంఘ్‌ పరివారంలో భాగమైన శ్రీ రామ సేన, హనుమాన్‌ సేన, శ్రీ అయ్యప్ప ధర్మసేన వంటి హిందూ సంఘాలు ప్రకటించాయి. అయితే తాము కోర్టు తీర్పును గౌరవిస్తామని, ప్రస్తుతం వీధుల్లో ఆందోళన చేయడం సరైంది కాదని భావిస్తున్నాం గనుకే బంద్‌కు దూరంగా ఉంటున్నామని ఆరెస్సెస్‌ పేర్కొంది. మరో హిందూ సంస్థ హిందూ ఐక్య వేదిక కూడా ఈ బంద్‌లో పాల్గొనడం లేదని తెలిపింది.

సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ బంద్‌ కారణంగా ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగనీయమని శ్రీరామ సేన తెలిపింది. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకుల కార్యకలాపాలకు ఆటంకం సృష్టించబోమని పేర్కొంది. అదే విధంగా ప్రజా రవాణా వ్యవస్థకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగదని తెలిపింది. కాగా శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ దీపక్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆలయాలు ప్రైవేటు ఆస్తులు కావని, మహిళలను ఆలయంలోని రాకుండా ఆడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు