ఆర్బీఐ వర్సెస్‌ ఆరెస్సెస్‌

16 Nov, 2018 10:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈనెల 19న ఆర్బీఐ బోర్డు కీలక భేటీ నేపథ్యంలో కేంద్ర బ్యాంక్‌పై ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త, ఆర్బీఐ పార్ట్‌టైమ్‌ డైరెక్టర్‌ స్వామినాథన్‌ గురుమూర్తి విరుచుకుపడ్డారు. ఆర్థిక వ్యవస్థ స్ధితిగతులపై ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న గురుమూర్తి ఆర్బీఐ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరపతి నిబంధనల సరళీకరణ వంటి మోదీ సర్కార్‌ చర్యలను సమర్ధిస్తూ మాట్లాడారు.

మొం‍డి బకాయిల కోసం నిధులు కేటాయింపుపై ఆర్బీఐ విధానం సహేతుకం కాదని విమర్శించారు. 2009 నుంచి నిరర్థక ఆస్తులు పెరగడం ఊపందుకుందని, ఆ సమయంలో బ్యాంకులను అప్రమత్తం చేయని ఆర్బీఐ 2015లో వీటికి కేటాయింపులు చేపట్టాలని బ్యాంకుకు సూచించాయని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల కిందటే ఎన్‌పీఏలకు కేటాయింపులపై ఆర్బీఐ బ్యాంకులకు సంకేతం పంపితే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని అన్నారు.

ఎన్‌పీఏ నిబంధనల విషయంలో ఆర్బీఐ సమతూకంతో వ్యవహరించలేదని, విధాన నిర్ణయాలతో సంక్షోభాలను అధిగమించాలని, విధానాలతోనే సంక్షోభాలను తీసుకురాకూడదని చురకలు వేశారు. మూలధన నిబంధనల విషయంలో భారత్‌లో స్థూల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని, గుడ్డిగా అమెరికా తరహాలో వ్యవహరించరాదని చెప్పుకొచ్చారు.

మనది జపాన్‌ తరహాలో బ్యాంకింగ్‌పై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థని, అమెరికా తరహాలో మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదన్నది గుర్తెరగాలన్నారు. చిన్నతరహా వ్యాపారాలకు నిధులు అందుబాటులో ఉంచకపోవడం భారత ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు