ఆరెస్సెస్‌ పట్టుబట్టడంతోనే!

20 Jun, 2018 01:09 IST|Sakshi

సూరజ్‌కుండ్‌ చర్చల్లోనే ఈ నిర్ణయం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగాలన్న బీజేపీ నిర్ణయం అనూహ్యం. అయితే ఇందుకు ప్రధానకారణం రాష్ట్రీ య స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) నుంచి బీజేపీకి అందిన ఆదేశాలేనని విశ్వసనీయవర్గాల సమాచారం. పీడీపీతో అసహజ పొత్తు కారణంగా జమ్మూ ప్రాంతంలోని హిందువుల్లోనూ బీజేపీ తన పట్టు కోల్పోతోందని ఆరెస్సెస్‌ భావించి, నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో గతవారం బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలు మూడు రోజులపాటు సమావేశమై విస్తృత చర్చలు జరపడం తెలిసిందే. అక్కడే జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు చర్చకు రాగా, పీడీపీతో కలసి బీజేపీ అధికారంలో కొనసాగితే గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు కూడా ఈసారి రావని ఆరెస్సెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు.

పూర్తి అధికారం కోసమేనా?
ప్రభుత్వం బీజేపీ నుంచి వైదొలగడానికి మరో అంశం కూడా కారణమయ్యుండొచ్చని వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల్లో పీడీపీ ఆధిపత్య ధోరణితో వ్యవరిస్తుండటంతో.. గవర్నర్‌ పాలన ద్వారా కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించవచ్చనే ఉద్దేశంతోనే కాషాయదళం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు పేర్కొంటున్నారు. అలాగే పాలనపై పూర్తి అధికారం ఉంటే జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాదులు, వేర్పాటువాదులను సమర్థంగా అణచివేయవచ్చని బీజేపీ నమ్ముతోంది.

మరోవైపు 2014 ఎన్నికలప్పటికంటే ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందనీ, ఇదే కొనసాగితే సార్వత్రిక ఎన్నికల్లో భంగపాటు తప్పదని ఆరెస్సెస్‌ హెచ్చరించినట్లు సమాచారం. మోదీకి మరోసారి ప్రధాని అభ్యర్థిగా మద్దతు లేకపోతే, ఆయన స్థానంలో మరొకరిని తెరపైకి తెచ్చే ప్రత్యామ్నాయాన్ని కూడా ఆరెస్సెస్‌ సిద్ధం చేస్తున్నట్లు బోగట్టా. త్వరలో జరిగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం శాసనసభల ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవడంపైనా ఆరెస్సెస్‌ అసంతృప్తిగా ఉంది.

మరిన్ని వార్తలు