నీరుగారుతోన్న ఆర్‌టీఈ లక్ష్యం

1 Jul, 2019 20:24 IST|Sakshi

జైపూర్‌: పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం(ఆర్‌టీఈ) లక్ష్యం మధ్యలోనే నీరుగారిపోతోంది. 6 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలన్న సమున్నత లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాన్ని 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రాథమిక విద్య పూర్తయేంతవరకు పిల్లలకు ఉచితంగా, నిర్బంధ విద్యను అందించాల్సి ఉంటుంది. పిల్లలు తమకు సమీపంలోని పాఠశాలలో ఉచితంగా ప్రాథమిక విద్యను పూర్తి చేసేందుకు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 3 అవకాశం కల్పిస్తోంది. ఆర్‌టీఈ కింద పాఠశాలన్నీ 25శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుంది.

ఈ చట్టం ప్రకారం ప్రముఖ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన విద్యార్థులు తర్వాత బడి మానేసి దినసరి కూలీలుగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల కారణంగా ఆర్‌టీఈ విద్యార్థులు విద్య కొనసాగించలేకపోతున్నారు. ఆర్‌టీఈ కింద 8వ తరగతి వరకు మాత్రమే ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి నుంచి ఫీజులు చెల్లించి చదువు కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చదివించే స్తోమతలేక తల్లిదండ్రులు పిల్లలను చదువు మాన్పించేసి, తమతో పాటు పనులకు తీసుకెళ్లిపోతున్నారు.

 ‘ఆర్‌టీఈ కోటాలో చేరిన విద్యార్థుల్లో కొంత మంది చాలా తెలివైనవారు ఉంటున్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక మధ్యలోనే చదువు ఆపేస్తుండటం బాధ కలిగిస్తోంది. వీరిలో డ్రైవర్లు, దినసరి కూలీల పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. 8వ తరగతి పూర్తి చేసిన తర్వాత తమ తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళ్తుఉన్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత వీరిని పాలకులు పట్టించుకోకపోవడం విచారకరమ’ని జైపూర్‌లోని ప్రముఖ పాఠశాల ప్రిన్సిపాల్‌ ఒకరు వ్యాఖ్యానించారు. ఆర్‌టీఈ కోటాను 8 నుంచి 12వ తరగతి వరకు పొడించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు రాజస్తాన్‌ విద్యా శాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ తెలిపారు. దీనికి అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు