ఇతర వ్యవస్థలపైనా ‘ఆర్టీఐ’ ప్రభావం!

26 Jul, 2019 19:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు సవరణ చట్టం బిల్లును పార్లమెంట్‌ గురువారం నాడు ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య మూజువాణి ఓటుతో ఆమోదించిన విషయం తెల్సిందే. బిల్లులో ఎలాంటి సవరణలు చోటు చేసుకున్నాయి ? ఆ సవరణలను ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వాటి వల్ల ప్రమాదకర పరిణామాలు ఏమైనా ఉంటాయా? అసలు మాజీ సమాచార కమిషనర్లు దీనిపై ఏమంటున్నారు? 

ప్రభుత్వ కార్యకలాపాలు, విధుల నిర్వహణకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. సమాచార కమిషనర్ల ఆదేశం మేరకు సంబంధిత ప్రభుత్వ శాఖ, విభాగం ప్రజలు అడిగిన సమాచారాన్ని విధిగా అందించాలి. సమాచార కమిషనర్లు ప్రభుత్వానికి లొంగకుండా తటస్థ వైఖరిని అవలంబించాలనే ఉద్దేశంతో సమాచార కమిషనర్లకు భారత ఎన్నికల కమిషన్‌లోని కమిషనర్లకు ఇచ్చినంత జీతభత్యాలను ఇవ్వాలని చట్టంలోనే నిర్దేషించింది. వారికి ఐదేళ్ల కాల పరిమితిని కూడా నిర్ణయించింది. 

ఇప్పుడు ఈ నిబంధనలను ఎత్తివేస్తూ జీతభత్యాలను, పదవీ కాలాన్నీ ప్రభుత్వమే నిర్ణయించే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. దీంతో సమాచారా కమిషనర్ల వ్యవస్థతో పారదర్శకత లోపిస్తుందని, ప్రభుత్వం ఒత్తిడి వారు లొంగిపోయే అవకాశం ఉందంటూ విపక్షాలు గొడవ చేశాయి. అలా జరగదని, ఎన్నికల కమిషన్‌ అనేది రాజ్యాంగం ప్రకారం వచ్చిందని, రాజ్యాంగ సవరణల ద్వారానే అందులో మార్పులు, చేర్పులు చేసుకున్నాయని, అదే సమాచార చట్టాన్ని పార్లమెంటరీ చట్టం ద్వారా తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. 

ఎన్నో వ్యవస్థలపై ప్రభావం 
ప్రభుత్వ వాదనను ప్రమాణంగా తీసుకుంటే పార్లమెంటరీ చట్టం కింద ప్రత్యేక స్వయం ప్రతిపత్తిగల సంస్థలైన సుప్రీం కోర్టు, హైకోర్టులు, కంట్రోల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, లోక్‌పాల్, జాతీయ మానవ హక్కుల కమిషన్లను సవరించాల్సి ఉంటుందని, అలా చేస్తే వాటి స్వయం ప్రతిపత్తి కూడా దెబ్బతింటాయని మాజీ సమాచార కమిషనర్లు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు