ఫిరాయింపుల్ని త్వరగా తేల్చాలి

5 Sep, 2018 02:12 IST|Sakshi

ఉప రాష్ట్రపతి వెంకయ్య

న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రతిష్టను పునరుద్ధరించడమే తన తక్షణ ప్రాధాన్యతని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు చెప్పారు. సభలో అనుచితంగా ప్రవర్తించే సభ్యుల్ని నియంత్రించేందుకు రాజ్యసభ నియమావళిలో మార్పులు అవసరమని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కఠిన నిబంధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. చట్టసభ సభ్యుడు పార్టీ మారినప్పుడు అందే ఫిర్యాదులపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవడం, ఎన్నికల సంబంధిత పిటిషన్ల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వంటి సంస్కరణలు చేపట్టాలన్నారు.

పార్టీల్ని వదిలిపెట్టే చట్ట సభ్యులు వారి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. ‘అది కనీస నైతిక బాధ్యత. దీనిని రాజ్యాంగ బాధ్యతగా మార్చాలని కోరుతున్నా’ అని అన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ.. పార్టీ ఫిరాయింపుల కేసుల్లో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యంపై∙ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతి పార్టీ స్వలాభం చూస్తోంది. అన్ని పిటిషన్లను 3 నెలల్లోపు పరిష్కరించాలి. చట్ట సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని సవరించాలి.

మీరు ప్రిసైడింగ్‌ అధికారి స్థానంలో ఉండి ఫిర్యాదులపై జాప్యం చేస్తే మీరు చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం’ అన్నారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే పార్లమెంట్‌ నియమావళిని మార్చేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజ్యసభ నియమావళి సమీక్ష కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించిందని, అక్టోబరు చివరినాటికి తుది నివేదిక అందచేస్తుందని అన్నారు. రిజర్వేషన్‌ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని.. రిజర్వేషన్లకు అర్హులైన వారిలో కొందరికే కోటా ఫలాలు అందుతున్నాయని, దీంతో కొన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు