పార్లమెంట్‌లో స్మో'కింగ్'లకు షాక్

22 Jul, 2015 13:26 IST|Sakshi
పార్లమెంట్‌లో స్మో'కింగ్'లకు షాక్

న్యూఢిల్లీ: వ్యాపం, లలిత్ గేట్ కుంభకోణాలపై పరస్పరం కత్తులు దూసుకుంటున్న పాలక, ప్రతిపక్షాల సభ్యులు పార్లమెంట్‌లో మంగళవారం హఠాత్తుగా కలసిపోయారు. వారంతా ఓ బృందంగా ఏర్పడి కలసికట్టుగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వద్దకు వెళ్లారు. వారంతా కలసి రావడాన్ని చూసిన మహాజన్ కూడా కాసేపు తన కళ్లను తానే నమ్మలేదట. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు చివరకు పాలక, ప్రతిపక్షాలు ఓ ఒప్పందానికి వచ్చాయని ఆమె సంతోషించారట. తాము సమావేశాల గురించి చర్చించేందుకు రాలేదని, సెంట్రల్ హాల్ పక్కనున్న స్మోకింగ్ రూమ్‌ను ఎందుకు తీసేశారో ప్రశ్నించేందుకు వచ్చామని వారు చెప్పడంతో స్పీకర్ సంతోషం కాస్త నీరు కారింది. అయినా ఈ విషయంలో తనను ప్రశ్నించడాన్ని సహించనని, అవసరమైతే స్మోకింగ్ రూమ్ కోసం ఓ పిటిషన్ పెట్టుకోవాలని సూచించారు.

పార్లమెంట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి పొగ తాగకుండా తీవ్ర అసహనానికి గురవుతున్న ఎంపీలు చేసేది లేక స్పీకర్ సూచన మేరకు ఆమెకో ఆర్జి పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సెంట్రల్ హాల్ పక్కనున్న స్మోకింగ్ రూమ్‌ను కొత్తగా స్టెనోగ్రాఫర్లకు కేటాయించడంలో పొగరాయుళ్లకు చిక్కొచ్చి పడింది. పార్లమెంట్ భవన ప్రాంగణం మొత్తం 'నో స్మోకింగ్ జోన్' అవడం వల్ల ఎంపీలెవరూ బయట స్మోకింగ్ చేయడానికి వీల్లేదు. పార్లమెంట్ సమావేశ మందిరంలో పాలక, ప్రతిపక్షాలు ఒకరినొకరు ఎంత దూషించుకున్నా, వారు ఇట్టే కలసిపోయేది మాత్రం స్మోకింగ్ రూమ్‌లోనే. వారు అక్కర పరస్పర వ్యూహాల ప్రతులను మార్చుకున్న సందర్భాలూ, అట్టే ప్రశ్నలతో నన్ను సభలో వేధించమాకే! అంటూ మంత్రులు... సభ్యులను వేడుకున్న సందర్భాలు ఇక్కడ అనేకం.

సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరణ్ రిజిజు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సౌగత రాయ్, కళ్యాణ్ బెనర్జీలు తరచూ స్మోకింగ్ రూమ్‌లో కనపిస్తారు. వీరిలో మరీ సిగరెట్టు మీద సిగరెట్టు పీకేది మాత్రం ఆశోక గజపతి రాజు. ఆయన తన పార్టీ కార్యాలయంలోకన్నా స్మోకింగ్ రూమ్‌లో ఉంటారన్నది ప్రతీతి. ఇంతకు స్మోకింగ్ రూమ్‌ను స్టెనోగ్రాఫర్లకు ఎందుకు కేటాయించారంటే.... వారు ఇంతవరకున్న కార్యాలయాన్ని తృణమూల్ కాంగ్రెస్‌కు కేటాయించడం వల్ల. గత ఏడాది కాలంగా పార్లమెంట్‌లో ఆ పార్టీకి కార్యాలయం లేదు.

వాస్తవానికి ఆ పార్టీకి పార్లమెంట్ భవనంలోని ఐదోనెంబర్ ఆఫీసు గదిని కేటాయించారు. అందులో ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఆ ఆఫీసును ఖాళీ చేయలేదు. 1984లో తమ పార్టీ తొలిసారి పార్లమెంట్‌లో కాలిడినప్పటి నుంచి అందులో ఉంటున్నామని, అది తమకు ఎంతో అచ్చి వచ్చిందని, ఖాళీ చేయమంటూ మొండికేసింది. దీంతో తృణమూల్‌కు ప్రత్యామ్నాయం చూపించాల్సి వచ్చింది. బుధవారం నాటికి కూడా మన పొగరాయుళ్లకు స్పీకర్ మహాజన్ ప్రత్యామ్నాయ స్మోకింగ్ రూమ్‌ను చూపించలేకపోయారు. ఇదే మంచి తరుణమనుకున్న పొగరాయుళ్లు లాన్‌లోకి వెళ్లి అందరి ముందే దర్జాగా పొగ గుప్పుగుప్పుమని ఊదేస్తున్నారు.

మరిన్ని వార్తలు