బంగారంపై వదంతులు నమ్మొద్దు

1 Dec, 2016 20:44 IST|Sakshi
బంగారంపై వదంతులు నమ్మొద్దు
 చట్టబద్ధంగా సమకూర్చుకుంటే ఒకరి వద్ద ఎంత బంగారమైనా ఉండొచ్చు
 పరిమితులేమీ పెట్టబోవడం లేదు
కేంద్ర ఆర్థికశాఖ, కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు  (సీబీడీటీ) స్పష్టీకరణ
 
వదంతి: నల్లధనంపై భారీగా 85 శాతం పన్ను ప్రతిపాదించినట్లుగానే... ఐటీ చట్టానికి తెస్తున్న సవరణలో పెద్ద మొత్తంలో బంగారం, బంగారు ఆభరణాలు ఉంటే కూడా పన్నులు, జరిమానాలు వేయనున్నారు. లాకర్లన్నీ తనిఖీ చేస్తారు.
 
వాస్తవం (సీబీడీటీ వివరణ): అలాంటిదేమీ లేదు. లెక్కల్లో చూపని ఆదాయంపై పన్నును పెంచడానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 115బీబీఈకి సవరణ ప్రతిపాదించారు. ప్రస్తుతం 30 శాతం ఉన్న గరిష్ట పన్నును 60 శాతానికి పెంచుతారు. దీనిపై 25 శాతం సర్‌చార్జి వేస్తారు. అంటే పన్ను 75 శాతానికి చేరుతుంది. లెక్కచూపని ఆదాయంగా నిర్ధారణ అయితే మరో 10 శాతం జరిమానా విధిస్తారు. తద్వారా పట్టుబడిన నల్లధనంలో 85 శాతం ప్రభుత్వానికే పొతుంది. మంగళవారం లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభ ముందున్న ఈ సవరణ బిల్లులో బంగారంపై ఎలాంటి కొత్త పన్నును ప్రతిపాదించలేదు. 
 
♦ ప్రకటిత ఆదాయంతో కొన్న బంగారంపై ఎలాంటి కొత్త పన్ను, జరిమానా ఉండదు. 
♦ వ్యవసాయరంగం లాంటి మినహాయింపున్న రంగం నుంచి వచ్చిన ఆదాయంతో బంగారం కొన్నా కొత్తపన్నేమీ వేయరు.
♦ ఇల్లాలు దాచిన డబ్బుతో కొన్నా... కొత్తగా పన్ను ఉండదు. అయితే ఇలాంటి బంగారం పరిమాణం సహేతుకంగా ఉండాలి. ఆదాచేయగలిగేది ఎంత? కొన్నది ఎంతనే దానికి పొంతన ఉండాలి.
♦ వారసత్వంగా పూర్వీకుల నుంచి వచ్చిన బంగారం లేదా ఆభరణాలపైనా పన్నువేయరు.
♦ ప్రస్తుతం ఉన్న చట్టాల్లోనూ ఇలాంటి నిబంధనలు లేవు... ప్రతిపాదిత సవరణల్లోనూ ఇలాంటివేమీ పెట్టలేదు.
 
వదంతి: వివాహిత 500 గ్రాములు (50 తులాలు), అవివాహిత మహిళ 250 గ్రాములు (25 తులాలు), పురుషుడి వద్ద 100 గ్రాముల (10 తులాలు)కు మించి ఉంటే... ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. దీనిపై భారీ పన్ను వేస్తారు.
 
వాస్తవం: నిజం కాదు. కొత్త చట్టంలో బంగారంపై అదనపు పన్నులు వేయడం, పన్ను పెంచడం లాంటివేమీ చేయలేదు. ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తున్నపుడు కూడా వివాహిత వద్ద 50 తులాలు, అవివాహిత అయితే 25 తులాలు, పురుషుడి వద్ద 10 తులాలకు పైగా ఉంటేనే... వాటిని స్వాధీనం చేసుకోవాలని, పైన చెప్పిన దానికన్నా తక్కువ ఉంటే అలాంటి బంగారం, ఆభరణాల జోలికి వెళ్లకూడదనే నిబంధన ఉంది. బంగారంపై కొత్త పన్నులేమీ ప్రతిపాదించలేదని వివరణ ఇస్తూ ఐటీ శాఖ పై నిబంధనను ఉటంకించింది. దీనికి కూడా వక్రభాష్యం చెప్పి... 50 తులాల కంటే ఎక్కువుంటే స్వాధీనం చేసేసుకుంటారని పుకార్లు లేవదీశారు. 
 
♦ చట్టబద్ధంగా సమకూరినదైతే ఒక వ్యక్తి తన వద్ద ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు.  అనేదానిపై పరిమితులేమీ పెట్టబోవడం లేదు. 
♦ ఒకవేళ దాడులు జరిగినపుడు 50 తులాలకు మించి ఉన్నా... ఆయా వర్గాల ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వం ఐటీ శాఖకు ఆదేశాలు జారీచేసింది. 
♦ బంగారంపై వస్తున్న పుకార్లను ఖండించడానికి, ఒక వ్యక్తి తన వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చనే పరిమితిపై వివరణ ఇవ్వడానికి గురువారం ఆర్థిక శాఖ రెండుసార్లు ప్రకటనను విడుదల చేసింది.
                                                                                                                    -సాక్షి నాలెడ్జ్ సెంటర్
మరిన్ని వార్తలు