‘ఉపాధి’లో రాష్ట్రానికి ఐదు అవార్డులు

20 Jun, 2017 02:35 IST|Sakshi
‘ఉపాధి’లో రాష్ట్రానికి ఐదు అవార్డులు

ఢిల్లీలో ప్రదానం చేసిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణకు పలు అవా ర్డులు దక్కాయి. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ 2015–16 సంవత్సరానికిగాను ప్రకటించిన అవార్డుల్లో ఉపాధి హామీ పథకం అమలు లో పారదర్శకత–జవాబుదారీతనం, అత్యధిక పని దినాలు, సకాలంలో వేతనాల చెల్లింపు, పోస్టాఫీసు ల ద్వారా కూలీలకు డబ్బు అందించడం వంటి విభాగాల్లో తెలంగాణకు ఐదు అవార్డులు దక్కాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ అవార్డులను ప్రదానం చేశారు.

పారదర్శకత– జవాబుదారీతనం, జియోట్యాగింగ్‌ అమలు విభాగాల్లో లభించిన అవార్డులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూప్రసాద్‌ కుమారి అందుకున్నారు. అత్యధిక పనిదినాలు పూర్తి చేసిన జిల్లాల విభాగంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా అవార్డు దక్కించుకుంది. గ్రామాల్లో ఎక్కువరోజులు పని కల్పించిన పంచాయతీ కేటగిరీలో నిజామాబాద్‌ జిల్లా మనోహరాబాద్‌ పంచాయతీ అవార్డు సాధిం చింది. సర్పంచ్‌ తిరుపతి రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. కూలీలకు సకాలంలో డబ్బులు పంపిణీ చేసిన పోస్టాఫీసు విభాగంలో నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయ్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ అబ్దుల్‌ సత్తార్‌ అవార్డు అందుకున్నారు. ఉత్తమ జాతీయ వనరుల సంస్థ, జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్‌ అవార్డును సెర్ప్‌ సీఈవో పొసుమి బసు అందుకున్నారు.

మరిన్ని వార్తలు