పెట్టుబడి పెట్టండి.. గ్రీన్‌ కార్డు పట్టండి!

17 Feb, 2017 08:39 IST|Sakshi
పెట్టుబడి పెట్టండి.. గ్రీన్‌ కార్డు పట్టండి!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ నివసిస్తున్న విదేశీయుల గుండెల్లో దడ పుట్టిస్తు‍న్నాయి. అమెరికా కలలు కల్లలు కాకుండా ఉండటానికి ఉన్న ఒకే ఒక ఆశాకిరణాన్ని అందుకునేందుకు త్వరపడుతున్నారు. అదే ఈబీ-5 ప్రోగ్రాం. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఈబీ-5 వీసా ప్రోగ్రాం ముగిసిపోతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా అమెరికాలో పెట్టుబడులు పెడితే చాలు సదరు వ్యక్తి, అతని కుటుంబంతో సహా జీవితకాలం అమెరికాలోనే ఉండొచ్చు. ఈబీ-5 ప్రోగ్రాంలో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

ఒక మిలియన్‌ డాలర్లతో స్టార్టప్
ఒక మిలియన్‌ డాలర్ల మూలధనంతో అమెరికాలో స్టార్టప్‌ను మొదలుపెట్టాలి. దాంట్లో పది మంది అమెరికన్లకు ఫుల్ టైమ్ ఉద్యోగాలు ఇవ్వాలి.

పెట్టుబడి
ప్రభుత్వం అప్రూవ్ చేసిన ఈబీ-5 బిజినెస్‌లో రూ.3.4 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి ద్వారా రూరల్‌లో నివసిస్తున్న పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తారు. పెట్టుబడిదారుడు కావాలనుకుంటే ఐదేళ్ల తర్వాత తన డబ్బును ఉపసంహరించుకోవచ్చు.

దీంతో ఈ ప్రోగ్రామ్‌లో చేరేందుకు భారతీయులు క్యూ కడుతున్నారు. గత కొద్ది వారాలుగా సరాసరిన వారానికి ముగ్గురు భారతీయులు ఈ ప్రోగ్రాంలో పెట్టుబడులకు సంతకాలు పెట్టేస్తున్నారు. ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ నిర్ణయం తర్వాత హెచ్‌1బీ వీసాలపై కూడా ఆంక్షలు తప్పవనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఈబీ-5 ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకునే విదేశీయుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటివరకూ 210 ఈబీ-5 దరఖాస్తులు రాగా.. వాటిలో 42 భారతీయులవే ఉన్నాయి. బెయిన్‌, రిలయన్స్, ఆదిత్య బిర్లా, మెక్‌కిన్సే లాంటి కంపెనీల్లో పెద్ద స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారకుటుంబాలు ఈ దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు