నేతాజీపై సమాచారం : రష్యా స్పందన ఇలా..

24 Jul, 2019 18:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌పై తమ వద్ద రికార్డుల్లో ఎలాంటి సమాచారం లేదని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. నేతాజీకి సంబంధించిన సమాచారం గురించి 2014 నుంచి రష్యా ప్రభుత్వాన్ని భారత్‌ పలుమార్లు కోరుతున్న సంగతి తెలిసిందే. నేతాజీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి పత్రాలు లేవని, భారత్‌ వినతి మేరకు పరిశోధన చేపట్టినా ఈ అంశంపై అధిక సమాచారం అందించే ఎలాంటి పత్రాలూ లభ్యం కాలేదని రష్యా ప్రభుత్వం వెల్లడించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ బుధవారం పార్లమెంట్‌లో పేర్కొన్నారు

. ఆగస్ట్‌ 1945కు పూర్వం, ఆ తర్వాత నేతాజీ రష్యాలో ఉన్నారా..? 1945 ఆగస్ట్‌లో ఆయన రష్యాకు పారిపోయారా అని భారత్‌ తెలుసుకోవాలని భావిస్తోంది. సహాయ నిరాకరణోద్యమానికి ప్రచారం చేపట్టిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను బ్రిటిష్‌ అధికారులు జైలులో పెట్టడంతో భారత్‌లో బ్రిటిష్‌ పాలనను కూలదోసేందుకు ఆయన 1941లో జర్మనీ నాజీ మద్దతు కోరేందుకు దేశం విడిచిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో సోవియట్‌ రష్యాలో మద్దతు కూడగట్టేందుకు నేతాజీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మరిన్ని వార్తలు