కొత్త బ్లాక్‌హోల్స్‌కు స్టీఫెన్‌ హకింగ్‌ పేరు

22 Mar, 2018 13:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: రష్యన్‌ వ్యోమగాములు ఓ కొత్త బ్లాక్‌ హోల్‌(కృష్ణ బిలం)ను కనుగొన్నారు. తన జీవితమంతా అంతరిక్ష పరిశోధనలకు కేటాయించిన ప్రఖ్యాత బ్రిటీష్‌ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హకింగ్‌ పేరును బ్లాక్‌ హోల్‌కు పెట్టారు. కొత్తగా కనిపెట్టిన బ్లాక్‌ హోల్‌ ఓఫికస్‌ నక్షత్రాలు కూటమిలో ఉన్నట్లు కనుగొన్నారు. సరిగ్గా స్టీఫెన్‌హకింగ్‌ చనిపోయిన రెండు రోజుల తర్వాత ఈ విషయం కనిపెట్టారు. మాస్కో స్టేట్‌యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొంతకాలంగా నక్షత్రాల కూటమిలో గామా కిరణాల పేలుళ్లను(జీఆర్‌బీ) పరిశీలిస్తున్నారు.

నక్షత్రం కూలిపోవటం వల్లే పేలుడు సంభవించిందని, దాని స్థానంలో బ్లాక్ హోల్ ఏర్పడటానికి పరిస్థితులు దారితీశాయని వెల్లడించారు. గామా-రే ఖగోళ శాస్త్రంలో.. గామా-రే పేలుళ్లు చాలా శక్తివంతమైన పేలుళ్లు అని, సుదూరంలో ఉన్న గెలాక్సీలను కూడా అవి మింగేస్తాయని తెలిపారు. పేలుళ్ల సమయంలో విడుదలయ్యే శక్తిని టెలిస్కోపు ద్వారా బంధించడం కూడా దాదాపు అసాధ్యమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సెకనులోపదో వంతు నుంచి మిల్లీ సెకండ్‌ సమయంలో మాయమైపోతాయని చెప్పారు. కానీ అదృష్టవశాత్తు రష్యాన్‌ వ్యోమగాములు ఈ దృశ్యాన్ని బంధింపగలిగారని రష్యన్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది.

ఈ శక్తివంతమైన పేలుళ్లను స్పెయిన్‌ దేశంలోని టెనెరిఫ్‌ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన మాస్టర్‌-ఐఏసీ రోబోటిక్‌ టెలిస్కోప్‌ బంధించగలిగిందని తెలిపారు. బ్లాక్‌ హోల్‌పై పరిశోధనలకు గానూ దీనికి స్టీఫెన్‌హకింగ్‌ బ్లాక్‌ హోల్‌ అని నామకరణం చేసినట్లు రష్యన్‌ పరిశోధకులు, ఆస్ట్రోనామర్స్‌ టెలిగ్రామ్‌ జర్నల్‌లో పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణను జీఆర్‌బీ180316ఏ పేరుతో రిజిస్టర్‌ చేశారు. బ్లాక్‌ హోల్‌లో వెళ్లిన ఏ వస్తువులూ తిరిగి రాలేవు. కాంతిని కూడా బ్లాక్‌ హోల్స్‌ మింగేస్తాయి. స్టీఫెన్‌ హకింగ్‌(76) ఈ నెల 14న అమియోట్రోఫిక్‌ లాటెరల్‌ స్ల్కెరోసిస్‌- ప్రోగ్రెస్సివ్‌ న్యూరోడీజనరేటివ్‌ వ్యాధితో మరణించిన సంగతి తెల్సిందే.

మరిన్ని వార్తలు