ధర్మాసనం నుంచి తప్పుకున్న సీజే

17 Dec, 2019 14:51 IST|Sakshi

అక్షయ్‌ రివ్యూ పిటిషన్‌ విచారణ నుంచి తప్పుకున్న సీజే

సాక్షి, న్యూఢిల్లీ: దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నిర్భయ దోషి అక్షయ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ కొత్త మలుపు తిరిగింది. దోషుల్లో ఒకరైన అక్షయ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించే ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే తప్పుకున్నారు. అక్షయ్‌ పిటిషన్‌ను తాను వినబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో రివ్యూ పిటిషన్‌పై విచారణ కొరకు మరో కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే బాబ్డే కోడలు గతంలో నిర్భయ తరుఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో తన కోడలు వాదించే కేసులో తాను ఎలాంటి  తీర్పును ఇవ్వబోనని సీజే స్పష్టం చేశారు. అక్షయ్‌ పిటిషన్‌పై వాదనలు వినేందుకు బుధవారం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సీజే బాబ్డే స్థానంలో మరో సీనియర్‌ న్యాయమూర్తిని ధర్మాసనంలోకి తీసుకోనున్నారు. వారి వాదనలు విన్న అనంతరం.. బుధవారమే తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషిగా తేలిన అక్షయ్‌ సుప్రీంకోర్టులో క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారమే ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అయితే సీజే హఠాత్తుగా తప్పుకోవడంతో బుధవారానికి వాయిదా పడింది. దీంతో సుప్రీం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ముగ్గురు దోషులు దాఖలు చేసిన రిప్యూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తాజాగా అక్షయ్‌ పిటిషన్‌ కూడా కోర్టు కొట్టివేస్తే దోషుల ఉరిశిక్షకు ముహుర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు మూడురోజుల క్రితమే తీహార్‌ జైలుకు ఇద్దరు తలారిలు వచ్చారని తెలిసింది. దోషులను ఉరితీసేందుకు బిహార్‌లోని బక్సార్‌ జైలు నుంచి ఉరితాళ్లను కూడా తెప్పించినట్లు సమాచారం. రానున్న రెండు రోజుల్లో దోషులను ఉరి తీస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

>
మరిన్ని వార్తలు