శబరిమలలో భద్రత కట్టుదిట్టం

15 Jan, 2020 04:07 IST|Sakshi

మకరవిలక్కు ఉత్సవానికి సర్వం సిద్ధం

శబరిమల: సంక్రాంతి సందర్భంగా బుధవారం జరిగే మకరవిలక్కు ఉత్సవాలకు శబరిమల అయ్యప్ప ఆలయం సంసిద్ధమైంది. ఆలయ పరిసరాలన్నింటినీ కట్టుదిట్టమైన రక్షణ వలయంలోకి తీసుకొచ్చారు. భద్రత ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మండల దీక్షల తరువాత సంక్రాంతి రోజున అయ్యప్ప ఆలయంలో విశేష పూజలు, ఉత్సవాలు జరిగే విషయం తెలిసిందే. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందిన భద్రత కోసం వినియోగిస్తున్నామని ఆలయ నిర్వాహకులైన ట్రావన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు మంగళవారం తెలిపింది.

అయ్యప్ప తన బాల్యాన్ని గడిపినట్లు చెప్పే పండలం నుంచి ఆలయానికి విచ్చేసే నగల పెట్టె ‘తిరువాభరణం’తో విచ్చేసే ఊరేగింపునకు ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం స్వాగతం పలుకుతుందని బోర్డు తెలిపింది. మకరవిలక్కు దీపారాధనను దర్శించేం దుకు వేలాదిగా హాజరవుతారని అంచనా. ఉత్సవాల అనంతరం ఈ నెల 21వ తేదీన ఆలయం మూతపడనుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు