రాజ్యాంగానికి లోబడే మత విశ్వాసాలు

25 Jul, 2018 01:11 IST|Sakshi

శబరిమల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ: ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న  మహిళలకు ప్రవేశం నిషేధించటం సహా మతాచారాలు, సంప్రదాయాలన్నీ రాజ్యాం గానికి లోబడే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని నిరాకరించటంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. మహిళలపై నిషేధం మతాచారాల్లో కీలకమైందని ఆలయ నిర్వాహకులు నిరూపించుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.

‘రాజ్యాంగానికి లోబడే ప్రతి అంశమూ ఉంటుంది. ఇందులోని మతస్వేచ్ఛ హక్కుకు సంబంధించిన 25, 26 ఆర్టికల్స్‌ ప్రకారం ప్రజారోగ్యం, సమాజ శాంతి, నైతిక సూత్రాలకు లోబడి ప్రతి ఒక్కరూ వ్యవహరించాల్సి ఉంటుంది’ అని పేర్కొంది. ఇక్కడ నైతికత అంటే రాజ్యాంగపరమైన నైతికతగా గుర్తించాలని తెలిపింది.  పురుషాధిక్యాన్ని కొనసాగించేందుకే మహిళలకు ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారంది. అంతకుముందు శబరిమల ఆలయం ‘ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్‌’ తరఫున సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఘ్వి వాదనలు వినిపించారు.

‘వందల ఏళ్లుగా ప్రజల విశ్వాసాల ప్రకారమే ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం స్వచ్ఛందంగా అమలవుతోంది. ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా పరిశీలించుకోవచ్చు’ అని అన్నారు. ‘దేశ వ్యాప్తంగా ఉన్న దర్గాలు, మసీదుల్లోకి కూడా మహిళలకు ప్రవేశం లేదు. కొన్ని ఆలయాల్లోకి పురుషులు ప్రవేశించేందుకు వీలులేదు. ఇటువంటి సంప్రదాయాలను, నమ్మకాలను పరీక్షించాలనుకోవటం కొత్త సమస్యలను తెచ్చి పెట్టినట్లవుతుంది’ అని అన్నారు.

‘ఏది అవసరమైన సంప్రదాయమో సుప్రీంకోర్టు నిర్ణయించగలదా? హిందూ మతంలోని ముఖ్యమైన అంశాన్ని న్యాయస్థానం ఒక పిల్‌ ద్వారా పరిష్కరించలేదు. ప్రతి మతంలోనూ పురుషాధిక్యమే నడుస్తోంది. ఇతర మతాల్లో మహిళలను పురుషులతో సమానంగా పరిగణించడం లేదు’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు