200 ఏళ్ల క్రితమే నిషేధం

23 Nov, 2018 05:25 IST|Sakshi

శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశంపై బ్రిటిష్‌కాలంనాటి నివేదికలో వెల్లడి

తిరువనంతపురం: రుతుస్రావ వయసు అమ్మాయిలు, మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా 200ఏళ్ల క్రితమే నిషేధం ఉందనీ, అంతకుముందు ఇంకెన్నాళ్ల నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారో కచ్చితంగా తెలీదని పూర్వకాలం నాటి ఓ నివేదికలో తేలింది. శబరిమల ఆలయంపై 1820లో మద్రాస్‌ పదాతిదళానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు సర్వే చేసి ‘ట్రావెన్‌కోర్, కొచ్చి రాష్ట్రాల చరిత్రపై సర్వే’ అనే నివేదికను రూపొందించారు. బెంజమిన్‌ స్వాయిన్‌ వార్డ్, పీటర్‌ ఐర్‌ కాన్నర్‌ 1820 నుంచి ఐదేళ్లపాటు శబరిమల విశేషాలను సేకరించి ఈ నివేదిక రూపొందించారు.

1893 నుంచి 1901 మధ్య కాలంలో నాటి మద్రాస్‌ ప్రభుత్వం 2భాగాలుగా ఈ సర్వేను ముద్రించింది. కాగా, సంప్రదాయవాదులు శతాబ్దాల సంప్రదాయాన్ని మార్చకూడదన్న తమ వాదనను మరింత బలంగా వినిపించేందుకు బ్రిటిష్‌ కాలం నాటి ఈ నివేదిక తోడ్పడనుంది. సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 ఆధిక్యంతో ఈ తీర్పు చెప్పింది. మహిళలకు ప్రవేశాన్ని నిరాకరించేందుకే మొగ్గు చూపని జస్టిస్‌ ఇందూ మల్హోత్రా కూడా తన తీర్పులో వార్డ్, కాన్నర్‌ల సర్వే గురించి ప్రస్తావించారు.

‘బాలికలు, వృద్ధురాళ్లు ఆలయంలోకి వెళ్లొచ్చు. కానీ యుక్తవయసులో ఉన్నవారు, లైంగిక చర్యలో పాల్గొనే వయసులో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం నిషిద్ధం’ అని ఆ నివేదికలో బ్రిటిష్‌ అధికారులు పేర్కొన్నారు. శబరిమల ఆలయాన్ని ‘చౌరీముల్లా’ అనే పేరుతో ప్రస్తావించిన వీరు.. 1820ల్లోనే ఏడాదికి 15 వేల మంది వరకు భక్తులు శబరిమలకు వచ్చే వారని నివేదికలో రాశారు. మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం పూర్వకాలంలో అలిఖిత నియమమనీ, ఆ తర్వాత 1991లో కేరళ హైకోర్టు ఆ నియమానికి చట్టబద్ధత కల్పించిందని చరిత్రకారుడు శశిభూషణ్‌ పేర్కొన్నారు.

కేంద్రమంత్రి కారు అడ్డగింత
శబరిమలకు వచ్చిన కేంద్ర ఆర్థిక, నౌకాయాన శాఖల సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాధాకృష్ణన్‌ వాహనాన్నే పోలీసులు అడ్డుకున్నారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ పోలీసులు ఖండించారు. తాము ఆపిన కారు మంత్రి వాహన శ్రేణితో కలిసి కాకుండా వాళ్లు వెళ్లిపోయాక ఏడు నిమిషాలకు వచ్చిందనీ, ఆ కారులో నిరసనకారులు ఉన్నారనే అనుమానంతోనే ఆపామని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు