అర్ధరాత్రి అరెస్టులు

20 Nov, 2018 05:15 IST|Sakshi
సన్నిధానంలో ఆందోళనకు దిగిన అయ్యప్పభక్తులను చుట్టుముట్టిన పోలీసులు

శబరిమలలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

భక్తులను బందిపోటు దొంగల్లా చూస్తున్నారు: కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్‌

వారు భక్తులు కారు.. ఆరెస్సెస్, బీజేపీ మనుషులే: సీఎం విజయన్‌

శబరిమల/కోజికోడ్‌: శబరిమలలో ఆదివారం అర్ధరాత్రి కలకలం. పోలీసులు 69 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీం తో బీజేపీ, ఆరెస్సెస్‌ సోమవారం కేరళ వ్యాప్తం గా ఆందోళనలు నిర్వహించాయి. అయితే వారంతా శబరిమలలో అలజడి సృష్టించేందుకు వచ్చారన్న సమాచారంతోనే అదుపులోకి తీసుకున్నామనీ, నిజమైన భక్తులను ఇబ్బంది పెట్టలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో అయ్యప్ప భక్తులెవరూ లేరనీ, వారంతా శబరిమలలో నిరసనలకు దిగి పరిస్థితిని దిగజార్చేందుకు వచ్చినవారేనని సీఎం పినరయి విజయన్‌ చెప్పారు.

కోజికోడ్‌లో సీఎం మాట్లాడుతూ ‘వారెవరూ అయ్యప్ప భక్తులు కారు. అంతా ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలే. సమస్యలు సృష్టించేందుకే సన్నిధానం వద్దకు చేరుకున్నారు’ అని చెప్పారు. ఆలయం మూసివేశాక రాత్రి 11 గంటల తర్వాత కూడా వారంతా గుంపుగా చేరి అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూ నిరసనలకు దిగడంతోనే పరిస్థితి మరింత దిగజారకుండా ముందస్తుగా 69 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నెయ్యాభిషేకం చేయించడం కోసం వచ్చి, రాత్రి అక్కడే ఉన్న భక్తులను తాము ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు.

అయితే బీజేపీ పోలీసుల చర్యను ఖండించింది. కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్‌ కణ్నాంథనమ్‌ సోమవారం నిలక్కళ్, పంబ, సన్నిధానం వద్ద పర్యటించి భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని యుద్ధక్షేత్రంగా మార్చింది. భక్తులేమీ తీవ్రవాదులు కారు. యాత్రికులను బందిపోటు దొంగల్లా ఈ ప్రభుత్వం చూస్తోంది’ అని పేర్కొన్నారు. మరోవైపు శబరిమలలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అధికారంతో పోలీసులు భక్తులను అదుపులోకి తీసుకొని సన్నిధానం నుంచి పంపించేశారని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.  
 

సీఎం ఇంటి ముందు ధర్నా
అరెస్ట్‌లకు నిరసనగా ఆరెస్సెస్, బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంస్థ యువ మోర్చాల కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఇద్దరు కార్యకర్తలు కోజికోడ్‌లో సీఎం కాన్వాయ్‌కు అడ్డు తగిలారు. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని తిరువనంతపురంలో కొందరు కార్యకర్తలు సచివాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టగా, మరికొందరు సీఎం అధికారిక నివాసం ముందు ధర్నాకు దిగారు.

సుప్రీంకోర్టులో టీడీబీ పిటిషన్‌
అన్ని వయసుల మహిళలనూ శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పును అమలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ గుడి నిర్వహణను చూసుకునే ట్రావెన్‌కోర్‌ దేవస్థాన బోర్డు (టీడీబీ) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఆగస్టులో సంభవించిన భారీ వరదల కారణంగా ఇప్పటికే ఆలయ పరసరాల్లో వసతులు దెబ్బతిన్నాయనీ, సరైన సౌకర్యాలు లేనందున ఇప్పుడు యాత్రకు వస్తే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని టీడీబీ పిటిషన్‌లో పేర్కొంది. రుతుక్రమం వచ్చే వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకూడదన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న ఎత్తివేయడం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు