13న ‘శబరిమల’ పిటిషన్ల విచారణ

24 Oct, 2018 01:21 IST|Sakshi

సుప్రీం ముందుకు 19 పిటిషన్లు

న్యూఢిల్లీ/తిరువనంతపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను నవంబర్‌ 13న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని ఇదివరకే జారీచేసినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్కే కౌల్‌ల ధర్మాసనం మంగళవారం వెల్లడించింది.

రివ్యూ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని జాతీయ అయ్యప్ప భక్తుల అసోసియేషన్‌ తరఫు లాయర్‌ మాథ్యూస్‌ జె.నెదుంపరా విజ్ఞప్తి చేయడంతో బెంచ్‌ పైవిధంగా స్పందించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ 19 పిటిషన్లు దాఖలయ్యాయి. 10–50 ఏళ్ల మధ్యనున్న మహిళలూ అయ్యప్ప ఆలయంలోకి వెళ్లొచ్చని అత్యున్నత న్యాయస్థానం గత నెలలో చారిత్రక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

అపవిత్రం చేయొద్దు: స్మృతి ఇరానీ
శబరిమల సంప్రదాయాలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మద్దతు పలికారు. ప్రార్థించే హక్కు పేరిట ఆలయాన్ని అపవిత్రం చేయొ ద్దన్నారు. ‘కనీస విచక్షణతో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. రుతుస్రావ రక్తంతో తడిసి న న్యాప్‌కిన్లతో స్నేహితుల ఇంటికి వెళ్తామా? వెళ్లం కదా.. మరి దేవుడి నిలయమైన ఆలయంలోకి అలా అడుగుపెట్టొచ్చా? మనకు ప్రార్థించే హక్కు ఉంటుంది. కానీ ఆలయాన్ని అపవిత్రంచేసే హక్కు లేదు. ఈ తేడాను గుర్తించి సంప్రదాయాల్ని గౌరవించాలి’ అని అన్నారు.

మరిన్ని వార్తలు