ప్రత్యేక రోజుల్లో మహిళల ప్రవేశానికి గ్రీన్‌ సిగ్నల్‌!

15 Nov, 2018 20:31 IST|Sakshi

ప్రత్యేక రోజుల్లో మహిళలకు ప్రవేశం కల్పిస్తామన్న కేరళ సీఎం

తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమితిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి తీరతామని కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. మహిళల ప్రవేశాన్ని అడ్డగిస్తూ భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి మనోభావాలను గౌరవిస్తూనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు పాటిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే మహిళలకు ప్రవేశం కల్పించే యోచనలో ఉన్నామని తెలిపారు. ఈ విషయమై ఆలయ ప్రధాన పూజారితో తాను స్వయంగా మాట్లాడతానని విజయన్‌ పేర్కొన్నారు.

కాగా ఈనెల 17 నుంచి వార్షిక మండల దీక్ష సీజన్‌ ప్రారంభమవుతున్న క్రమంలో భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై,  సుప్రీంకోర్టు తీర్పు అమలు సాధ్యాఅసాధ్యాలపై చర్చించేందుకు గురువారం సీఎం విజయన్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ఉత్తర్వులను అమలు చేసేందుకు కాలపరిమితి కోరాలని, అప్పటివరకూ శాంతిభద్రతలను సక్రమంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని విపక్షాలు సూచించాయి. అయితే ఈ సూచనలను సీఎం పట్టించుకోలేదని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆరోపించాయి. ఈ కారణంగానే వాళ్లు సమావేశం నుంచి వాకౌట్‌ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు