‘మహిళల ప్రవేశం’పై ఉత్తర్వులకు సుప్రీం నో

14 Dec, 2019 08:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి వీలుగా పోలీసులు రక్షణ కల్పించాలంటూ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించడానికి సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ మేరకు ఇద్దరు మహిళా కార్యకర్తలు వేసిన పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం శుక్రవారం స్పష్టంచేసింది. ‘‘ఈ అంశం చాలా సున్నితమైనది. దీన్ని మరింత వివాదాస్పదం చేయొద్దు. దీనిపై గతంలోనే ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్‌ విచారణ జరిపింది కనక ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేం’’ అని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది.

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని సెప్టెంబర్‌ 28, 2018లో జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేదు. అయితే అదే అంతిమం కాదు’ అని ధర్మాసనం పేర్కొంది. ఏడుగురు జడ్జిలతో కూడిన బెంచ్‌ అంతిమ నిర్ణయం వెలువరించేవరకు తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేమని, ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే వెళ్లి పూజలు నిర్వహించవచ్చనని పేర్కొంది. గతేడాది ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది తెలుపగా.. ‘చట్టం మీకు అనుకూలంగానే ఉంది. దాన్ని ఎవరైనా అతిక్రమిస్తే అందుకు కారకులను జైలుకు పంపుతాం’ అని బెంచ్‌ వ్యాఖ్యానించింది. 

మరిన్ని వార్తలు