అయ్యప్ప బంగారం వ్యవహారం; తెరచుకోనున్న స్ట్రాంగ్‌రూంలు

27 May, 2019 13:10 IST|Sakshi

తిరువనంతపురం : శబరిమల అయ్యప్పస్వామి ఆలయ బంగారం వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. స్వామి వారి బంగారు, వెండి ఆభరణాలు మాయమయ్యాయని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం స్ట్రాంగ్‌ రూంలు తెరుచుకోనున్నాయి. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధికారుల ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించి ఆడిట్‌ జరుగనుంది. కాగా స్ట్రాంగ్‌ రూముల్లోని స్వామి వారి బంగారం మాయమైదంటూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు విజలెన్స్‌ వింగ్‌కు ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా స్ట్రాంగ్ రూముల్లో బంగారం భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలో బంగారం విషయమై దర్యాప్తు జరపాల్సిందిగా బీజేపీ నేతృత్వంలో హిందూ సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి. ఈ వ్యవహారంపై విచారణకు కేరళ హైకోర్టు ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దీంతో సోమవారం ఆడిట్‌ జరుగునుంది. ఇక ఈ విషయంపై స్పందించిన బోర్డు అధ్యక్షుడు పద్మకుమార్‌ బంగారం మాయమైందన్న విషయాన్ని కొట్టిపారేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు పాత కమిటీ బంగారానికి సంబంధించిన వివరాలు అందించలేదని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఇలాగే జరుగుతుందని.. ఒకవేళ ఆడిట్‌లో గనుక తేడాలు వచ్చినట్లైతే బాధ్యులపై బోర్డు తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు