పటిష్ట భద్రత మధ్య పూజలు

6 Nov, 2018 02:59 IST|Sakshi

శబరిమలలో తెరచుకున్న అయ్యప్ప ఆలయం

దర్శనానికి 5 వేల మంది రాక

ముఖ్య పూజారి చాంబర్‌ వద్ద మొబైల్‌ జామర్లు

కలకలం రేపుతున్న బీజేపీ అధ్యక్షుడి వీడియో

తిరువనంతపురం/శబరిమల: సాయుధ కమాండోలు.. భారీ సంఖ్యలో పోలీసులు.. అడుగడుగునా నిఘా కెమెరాలు.. కీలకప్రాంతాల్లో మొబైల్‌ జామర్లు..వంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో స్వామి అయ్యప్ప కొలువైన శబరిమల సోమవారం దుర్భేద్యమైన కోటగా మారింది. శ్రీచిత్ర తిరునాళ్‌ను పురస్కరించుకు ని నేడు జరిగే ప్రత్యేక పూజలకు గాను శబరిమల గుడిని పూజారులు సోమవారం సాయం త్రం 5 గంటలకు తెరిచారు. దీంతో స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ముందుకు కదిలారు. ఓ మహిళ (30) స్వామి దర్శనం కోసం రావడంతో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి.

ముఖ్యుల చాంబర్ల వద్ద జామర్లు
గత నెలలో శబరిమలలో పూజల సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న కేరళ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. 20 మంది సభ్యుల సాయుధ కమాండోల బృందాన్ని, 100 మంది మహిళా పోలీసులను కలిపి దాదాపు 2,300 మంది పోలీసులను ప్రధాన ఆలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో మోహరించింది. ఆలయ సముదాయంలో కూడా 50ఏళ్ల పైబడిన మíß ళా పోలీసులను నియమించింది. ముఖ్య పూజారి కందరారు రాజీవరుతోపాటు ఇతర అధికారులు మీడియాతో మాట్లాడే అవకాశం లేకుండా సెల్‌ఫోన్‌ జామర్లు ఏర్పాటు చేసింది.   

మహిళాప్రవేశంపై నిరసన..
ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు సుమారు 5వేల మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున వారిని బృందాలుగా లోపలికి అనుమతిస్తున్నారు. అలప్పుజ జిల్లా చెర్తాల ప్రాంతానికి చెందిన అంజు(30) తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి పంబ వద్దకు చేరుకుని స్వామి దర్శనం కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కొందరు మహిళా జర్నలిస్టులు కూడా భద్రత మధ్య పంబ వద్దకు చేరుకున్నారు. దీంతో హిందూ ఐక్య వేదిక నాయకురాలు శశికళ నేతృత్వంలో పంబ గణపతి ఆలయం వద్ద భక్తులు కొండపైకి వెళ్లే మార్గాన్ని దిగ్బంధించారు. రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నందున భక్తులెవరినీ అక్కడ ఉండేందుకు అనుమతించబోమని పోలీసులు తెలిపారు.  
 

అది బీజేపీ అధ్యక్షుడి సలహాయే..!
కోజికోడ్‌లో ఆదివారం జరిగిన యువమోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై మాట్లాడిన వివాదాస్పద ప్రసంగం వీడియో కలకలం రేపుతోంది. గత నెలలో ఆలయం తెరిచిన సమయంలో 50ఏళ్లలోపు మహిళలెవ్వరినీ లోపలికి రానివ్వబోనని, అవసరమైతే ఆలయ ద్వారాలను మూసివేస్తానని ఆలయ ముఖ్య పూజారి కందరారు రాజీవరు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆయన ఈ నిర్ణయానికి తానిచ్చిన సలహాయే కారణమని హైకోర్టు లాయర్‌ కూడా అయిన శ్రీధరన్‌ ఆ సమావేశంలో అన్నట్లు ఆ వీడియోలో ఉంది.

ఆలయాన్ని మూసివేస్తే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందా అని రాజీవరు అడగ్గా అలాంటిదేమీ ఉండదు.. భక్తులంతా మీ వెనుకే ఉన్నారంటూ పిళ్లై ఆయనకు భరోసా ఇచ్చారు. అయితే, ఈ విషయాన్ని ముఖ్య పూజారి రాజీవరు ఖండించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఈ వివాదం బంగారంలాంటి అవకాశం అని పిళ్లై కార్యకర్తలతో అన్నారు. దీనిపై సీఎం పినరయి విజయన్‌ మండిపడ్డారు. ‘బీజేపీ ఆడు తున్న నాటకాన్ని భక్తులు అర్థం చేసుకోవాలి. శబరిమలలో సమస్యలు సృష్టించాలనే బీజేపీ నేతల కుట్రలపై తగు ఆధారాలు మా వద్ద ఉన్నాయి’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సోమవారం శబరిమల ఆలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులు

మరిన్ని వార్తలు