ట్రావెన్‌కోర్‌ బోర్డు యూటర్న్‌

7 Feb, 2019 05:32 IST|Sakshi

మహిళల ప్రవేశంపై తీర్పునకు సమర్థన

‘శబరిమల’పై వాదనలు ముగిశాక తీర్పును రిజర్వు చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి రుతుస్రావ వయసున్న (18 నుంచి 50 ఏళ్లలోపు) మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించిన ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు బుధవారం అనూహ్యంగా మనసు మార్చుకుంది. శబరిమల ఆలయంలోకి రుతుస్రావ మహిళల ప్రవేశంపై గతేడాది ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు బోర్డు తరఫు న్యాయవాది రాకేశ్‌ ద్వివేది కోర్టుకు తెలిపారు. జీవసంబంధమైన లక్షణాల ఆధారంగా మహిళలపై వివక్ష చూపించడం సరికాదని వ్యాఖ్యానించారు. కాగా, ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అన్నిపక్షాల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్‌ బోర్డు గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించగా, నాయర్‌ సర్వీస్‌ సొసైటీ, ఆలయ తంత్రి తదితరులు తీర్పును సమీక్షించాలని కోరారు.

మతపరమైన సంస్థలకు వర్తించదు..
మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నాయర్‌ సర్వీస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) తరఫున సీనియర్‌ న్యాయవాది కె.పరశరణ్‌ వాదిస్తూ.. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 దేశంలోని అన్ని లౌకికవాద సంస్థలకు వర్తిస్తుంది. కానీ మతపరమైన సంస్థలకు ఇది వర్తించదు. ఆర్టికల్‌ 15 నుంచి మతపరమైన సంస్థలకు స్పష్టమైన మినహాయింపు దొరుకుతోంది. అంటరానితనం నిర్మూలనకు ఉద్దేశించిన ఆర్టికల్‌ 17ను సుప్రీంకోర్టు పొరపాటున తన తీర్పులో ఉదాహరించింది. ఎందుకంటే కొందరు మహిళలకు కులాల ఆధారంగా ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం లేదు.

శబరిమల అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి. ఈ విషయాన్ని తీర్పు సందర్భంగా కోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది’ అని తెలిపారు. మరోవైపు అయ్యప్పస్వామి ఆలయంలోకి కులం, మతం ఆధారంగా మహిళలు, పురుషులపై నిషేధం లేదని బోర్డు మాజీ చైర్మన్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. మహిళల్లోని ఓ వర్గాన్ని మాత్రమే నిషేధిస్తున్నందున ఆర్టికల్‌ 17(అంటరానితనం నిర్మూలన) దీనికి వర్తించదని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు