పైలట్‌, సింధియాలకు డిప్యూటీలతో సరి..?

13 Dec, 2018 13:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌ సీఎంగా కమల్‌నాథ్‌ వైపు మొగ్గుచూపిన కాంగ్రెస్‌ హైకమాండ్‌, రాజస్ధాన్‌లోనూ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌లో సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న యువ నేతలు జ్యోతిరాదిత్య సింధియా,  సచిన్‌ పైలట్‌లను డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు మొగ్గుచూపుతోంది.

సీఎం రేసులో ముందున్న సీనియర్లకు అవకాశం ఇస్తూ యువ నేతలను ఉప ముఖ్యమంత్రి పదవులతో సంతృప్తిపరచాలన్నది రాహుల్‌ వ్యూహంగా చెబుతున్నారు. మరోవైపు రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌లలో సీఎం పదవికి తీవ్రంగా పోటీపడుతున్న యువ నేతలు సచిన్‌ పైలట్‌, సింధియాలు అనుచరగణంతో దేశ రాజధానికి చేరుకోవడంతో కసరత్తు సంక్లిష్టంగా మారింది.

రాహుల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. యువనేతలు పైలట్‌, సింధియాలను పార్టీ పక్కనపెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి అనుచరులు ఏఐసీసీ కార్యాలయం వద్ద నినాదాలతో హోరెత్తించారు. సీనియర్లకు సహకరించాల్సిందిగా పైలట్‌, సింధియాలను రాహుల్‌ సహా అగ్రనేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు