పార్టీలో నాకు ఎలాంటి విలువ ఇవ్వడం లేదు:పైలట్‌

15 Jul, 2020 12:17 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో విభేదించి, పార్టీకి ఎదురు తిరిగిన నేత సచిన్ పైలట్‌పై కాంగ్రెస్‌ పార్టీ వేటు వేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి ఆయన్ను తొలగించారు. ఇలాంటి తరుణంలో పైలట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. పైలట్‌ బీజేపీలోకి వెళతారా.. లేక సొంత పార్టీ పెడతారా అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. పైలట్ స్పందించారు. తాను బీజేపీలో చేరడంలేదని, ఇప్పటికీ కాంగ్రెస్ సభ్యుడినే అని స్పష్టం చేశారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి తాను ఎంతగానో శ్రమించానని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసిన తాను తిరిగి ఆ పార్టీలో ఎలా చేరతాను అని ప్రశ్నించారు. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికే ఇలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదవుల నుంచి తొలగించిన తర్వాత కూడా తాను కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక తాను తిరుగుబాటు చేయడానికి గల కారణాలను ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు సచిన్‌ పైలట్‌. (రాజస్తాన్‌: సచిన్‌ పైలట్‌ కీలక డిమాండ్‌)

ఈ సందర్భంగా సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ.. ‘రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోయిన నాటి నుంచి నా ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఆయన అనుచరులతో ఏడాదిగా పోరాటం చేస్తున్నాను. అయితే గహ్లోత్‌ జీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేను ప్రత్యేక హోదాను కానీ.. అధికారాన్ని కానీ కోరడం లేదు. కేవలం ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ, రాజస్తాన్‌ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చమని మాత్రమే నేను కోరుతున్నాను. కానీ అశోక్ గహ్లోత్‌ నాకు, నా అనుచరులకు రాజస్తాన్ అభివృద్ధి కోసం పని చేయడానికి అనుమతి ఇవ్వలేదు. నా ఆదేశాలను పాటించవద్దని అధికారులుకు చెప్పారు. వారు నాకు ఫైళ్లను పంపేవారు కారు. కేబినెట్ సమావేశాలు, సీఎల్‌పీ సమావేశాలు నెలల తరబడి జరగలేదు. నా ప్రజలకు నేను చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి నన్ను అనుమతించకపోతే పార్టీలో నాకున్న విలువ ఏంటి’ అని సచిన్ పైలట్ ప్రశ్నించారు. (‘ప్రభుత్వాన్ని వ్యాపారంలా నడిపారు’)

అంతేకాక తాను అనేకసార్లు ఈ సమస్యలను లేవనెత్తానని సచిన్‌ పైలట్‌ తెలిపారు. ‘నేను రాజస్తాన్ ఏఐసీసీ ఇన్‌చార్జ్‌కి, ఇతర సీనియర్ నాయకులకు సమాచారం ఇచ్చాను. ఈ విషయాలను గహ్లోత్‌ జీ దృష్టికి కూడా తీసుకెళ్లాను. కానీ మంత్రులు, శాసనసభ్యుల మధ్య ఎటువంటి సమావేశం జరగలేదు. చర్చకు స్థానం లేదు’ అని పైలట్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు