కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసిన పైలట్‌

22 Jul, 2020 11:20 IST|Sakshi

రాజస్ధాన్‌ హైడ్రామా

జైపూర్‌ : బీజేపీలో చేరితే తనకు 35 కోట్ల రూపాయలు అందచేస్తానని ప్రలోభాలకు గురిచేశారని తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గిరిరాజ్‌ సింగ్‌ మలింగకు రెబెల్‌ నేత షాక్‌ ఇచ్చారు. తనపై ముడుపుల ఆరోపణలు చేసిన గిరిరాజ్‌ సింగ్‌కు పైలట్‌ బుధవారం లీగల్‌ నోటీసులు పంపారు. తమ నేతపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన గిరిరాజ్‌ సింగ్‌కు నోటీసులు జారీ చేశారని పైలట్‌ వర్గీయులు నిర్ధారించారు. కాగా పైలట్‌ తనతో సంప్రదింపులు జరుపుతూ పార్టీ మారేందుకు మీకు ఎంత మొత్తం కావాలని అడిగారని, 35 కోట్ల రూపాయలు అందిస్తామని చెప్పారని గిరిరాజ్‌ సింగ్‌ మంగళవారం తిరుగుబాటునేతపై ఆరోపణలు గుప్పించారు. గత ఏడాది డిసెంబర్‌ నుంచి బేరసారాలు సాగుతున్నాయని..తాను ఇలాంటి పనికి పాల్పడలేనని వారికి చెప్పానని..రెండు మూడు సార్లు పైలట్‌తోనూ మాట్లాడానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

గిరిరాజ్‌ సింగ్‌ మలింగ ఆరోపణలను సచిన్‌ పైలట్‌ తోసిపుచ్చారు. ఇవి నిరాధార ఆరోపణలని, తన ప్రతిష్టను మసకబార్చేందుకు కాంగ్రెస్‌ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ను ఉపముఖ్యమంత్రితో పాటు, కాంగ్రెస్‌ రాష్ట్ర చీఫ్‌ పదవుల నుంచి కాంగ్రెస్‌ తొలగించింది. మరోవైపు పైలట్‌ సహా 18 మంది ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ జారీ చేసిన అనర్హత నోటీసుల వ్యవహారంపై ప్రస్తుతం న్యాయస్ధానంలో విచారణ జరుగుతోంది. కాగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పైలట్‌ బీజేపీతో కలిసి కుట్రపన్నారని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆరోపిస్తుండగా బీజేపీతో కలిసేదిలేదని పైలట్‌ స్పష్టం చేస్తున్నారు. చదవండి : సచిన్‌ పైలట్‌ వర్గానికి 24 వరకు ఊరట

మరిన్ని వార్తలు