’వాళ్లిద్దర్నీ తక్షణమే కేబినెట్‌ నుంచి తొలగించాలి’

7 Apr, 2017 19:51 IST|Sakshi

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇద్దరు కుమారుల్ని బీహార్‌ మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ డిమాండ్‌ చేశారు. మట్టి కుంభకోణంపై లూలు తనయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై సుశీల్‌ కుమార్‌ మోదీ మాట్లాడుతూ... మట్టి కుంభకోణానికి సంబంధించి తమవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ..తక్షణమే వారిద్దర్ని కేబినెట్‌ నుంచి తొలగించాలన్నారు. నితీశ్‌ కేబినెట్‌లో లాలూ కొడుకుల్లో ఒకరు డిప్యూటీ సీఎం కాగా మరొకరు వైద్య, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు.

కాగా లాలూ ప్రసాద్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఓ సహాయానికిగానూ ఓ వ్యాపారవేత్త... ప్లాట్‌ను ఇవ్వడం జరిగిందన్నారు.  ఆ ప్లాట్‌ ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు ప్రేమ్‌ చంద్‌ గుప్తా, ఆయన కుటుంబసభ్యుల పేరుతో ఉందన్నారు. అనంతరం లాలూతో పాటు ఆయన కుమారుల పేరుపై బదలాయింపు జరిగిందన్నారు.  పట్నా శివారు ప్రాంతంలో ఉన్న ఈ  ప్లాట్‌లో ప్రస్తుతం ఓ పెద్ద వాణిజ్య భవన సముదాయం నిర్మిస్తున్నారు. ఓ ప్రైవేటు సంస్థ దీనిని నిర్మిస్తోంది.

ఈ క్రమంలో భవన నిర్మాణం కోసం భారీ తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో బయటకు తీసిన మట్టి మొత్తాన్ని కనీసం ఎలాంటి టెండర్‌ కూడా పిలవకుండా దాదాపు రూ.90లక్షలకు పాట్నా జూపార్క్‌కు విక్రయించారు. ఇదంతా కూడా అటవీశాఖ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో చోటు చేసుకుంది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో  మట్టి కుంభకోణంపై బిహార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు