'కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తానంటే ఆయనిష్టం'

28 Jun, 2016 15:54 IST|Sakshi
'కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తానంటే ఆయనిష్టం'

న్యూఢిల్లీ:  హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడ అన్నారు. రెండు రాష్ట్రాల నిర్ణయంతోనే హైకోర్టు విభజన జరగాలని ఆయన

మంగళవారమిక్కడ తెలిపారు. కేసీఆర్ కేంద్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. హైకోర్టు విభజన అంశంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, న్యాయవాదుల బృందం ఇవాళ సదానంద గౌడతో భేటీ అయ్యారు. అనంతరం సదానంద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాల నిర్ణయాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లా కేసీఆర్ మారతానంటే ఆయనిష్టమని సదానందా వ్యాఖ్యానించారు. ఏమీ చేయకపోయినా... ప్రతిరోజు కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం అలా చేస్తానంటే ప్రజలే తగిన జవాబు ఇస్తారన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని చదవాలని, కేంద్రంపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.

ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37వరకూ ఆమోదం ఉందని సదానంద గౌడ తెలిపారు. అలాగే తెలంగాణ హైకోర్టులో 24మంది వరకూ న్యాయమూర్తులకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 18మంది న్యాయమూర్తులు ఏపీకి చెందినవారు, మరో ముగ్గురు తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారన్నారు. ఈ వివరాలతో తాము విభేదించడం లేదన్నారు. కాని దిగువ కోర్టులతో సంబంధించినంత వరకూ ఏ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలోనే నియామకం అవుతారన్నారు. జడ్జిల నియామకాలకు సంబంధించి ప్రాథమిక విధానం ఇలా ఉంటుందని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టి పెడతారని సదానంద గౌడ అన్నారు. పునర్ విభజన చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ, తెలంగాణ వ్యవహారలను చూస్తారని, అయితే తెలంగాణ రాష్ట్ర సీఎం కేంద్రాన్ని నిందించడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

హైకోర్టు విభజనకు కేంద్రం ఎలాంటి చొరవ చూపలేదనడం సరికాదని సదానంద గౌడ అన్నారు. రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాలను ఓసారి పరిశీలించాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై మూడు,నాలుగుసార్లు తెలంగాణ ఎంపీలు తనను కలిశారని, ఇద్దరు ముఖ్యమంత్రులతో పలుమార్లు మాట్లాడినట్లు సదానంద తెలిపారు. రాష్ట్ర హైకోర్టు విభజన కోసం తాము చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు. హైకోర్టు విభజనపై ఇదివరకే పిల్ దాఖలైందని, ఆ పిల్ను పరిష్కరించారని, తర్వాత రివ్యూ పిటిషన్ కూడా దాఖలైందన్నారు. ప్రస్తుతం ఆ పిటిషన్ ఉమ్మడి హైకోర్టు ముందుందన్నారు. ఇప్పుడు హైకోర్టు విభజనపై ఏం మాట్లాడినా అది కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందన్నారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రిగా తాను కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని సదానంద గౌడ స్పష్టం చేశారు. ఇది తన దృష్టికి వచ్చినా, మిగతా అంశాలన్నింటిపైనా దృష్టి పెట్టినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఈ విషయాలన్నీ లేఖ రూపంలో రాసినట్లు ఆయన తెలిపారు. అలాగే గవర్నర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వాళ్ల పరిధిలో అంశాలు ఉన్నాయని సదానంద తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైకోర్టు విభజన అంశంలో మాట్లాడటం కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు. ఇంతకన్నా తాము ఏం చేసినా..రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నామని వారే అంటారని, తనవరకు తాను ఏం చేయాలో అది చేస్తున్నానని, ఈ విషయం మీడియాకు బాగా తెలుసునని సదానంద గౌడ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు