‘కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టారు’

13 Sep, 2016 11:50 IST|Sakshi
‘కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టారు’

న్యూఢిల్లీ : కావేరి జలవివాదంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ స్పందించారు. కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టరాని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. కన్నడిగులు, వారి ఆస్తులపై తమిళులు దాడులు చేశారన్నారు. అయితే ప్రతి ఒక్కరూ శాంతి, సమన్వయం పాటించాలని సదానంద సూచించారు. తమకే నీళ్లు లేవని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. హింసతో సమస్య పరిష్కారం కాదని, ఇరు రాష్ట్రాలు సమన్వయం పాటించాలన్నారు.

కావేరిలో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందుకే తమిళనాడుకు కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని సదానంద గౌడ అన్నారు. 40 శాతం తక్కువ వర్ష పాతంతో కేవలం రెండు, మూడు రిజర్వాయర్లలోనే తాగు నీటి లభ్యత వుందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎక్కువ వర్షాలు కురిసినపుడు ఈ పరిస్థితి లేదన్నారు. కేంద్రం  ట్రిబ్యునల్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని సదానంద అన్నారు. కాగా  కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం మరింతగా ముదిరిపోయి హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఇరు రాష్ట్రాల్లోనూ.. అవతలి రాష్ట్రానికి చెందిన ఆస్తులు, పౌరులు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి.

మరిన్ని వార్తలు