షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్!

3 Nov, 2015 11:27 IST|Sakshi
షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్!

లక్నో: విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ మహిళా నాయకురాలు సాద్వీ ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  బాలీవుడ్ హీరో  షారూక్ ఖాన్ దేశం నుంచి వెళ్లిపోవచ్చంటూ ఆమె విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజ్వరిల్లుతున్న మత ఘర్షణలను షారూక్ ఖండించిన  నేపథ్యంలో సాద్వీ ప్రాచీ ...షారుక్‌పై  మండిపడ్డారు.  ఆయనో పాకిస్తాన్ ఏజెంట్  అంటూ స్వాధ్వీ  నిన్న ఇక్కడ ఆవేశంతో ఊగిపోయారు.   అక్కడితో  ఈ ఫైర్ బ్రాండ్ ఆగ్రహం చల్లారలేదు. కావాలంటే  షారూక్ ఖాన్ పాక్ వెళ్ళిపోవచ్చంటూ  ధ్వజమెత్తారు.   

అనుచిత వ్యాఖ్యానాలు  చేస్తున్న  షారూక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలన్నారు.  దీంతో పాటుగా పద్మశ్రీ సహా, వివిధ ప్రతిష్ఠాత్మక  అవార్డులను వెనక్కి ఇస్తున్న వారిపై  కఠినంగా శిక్షించాలని సాద్వీ ప్రాచీ డిమాండ్ చేశారు. 50వ పుట్టిన రోజు జరుపుకున్న  షారూక్ ఖాన్‌పై  విఎస్పీ నేత  విమర్శలపై  బాలీవుడ్‌లో దుమారం రేగింది. అయితే గతంలో కూడా కూడా షారూక్ పై  స్వాధ్వీ  విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బాద్ షా సినిమాలు చూడ్డానికి వీల్లేదంటూ ఆమె ఆగ్రహం  వ్యక్తం చేశారు. షారుక్ సినిమాల వల్ల యువత పెడతోవ పడుతోందన్నారు.

 కాగా సృజన, మతాలపై అసహనం దేశానికి హానికరమని షారుక్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. సోమవారం తన 50వ పుట్టినరోజు సందర్భంగా కింగ్‌ఖాన్.. ప్రస్తుతం దేశంలో తీవ్ర అసహనం నెలకొందన్నారు. సినీరంగానికి చెందిన వారు, శాస్త్రవేత్తలు, రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని సమర్థించారు. వెనక్కి ఇవ్వడానికి తనకు జాతీయ ఫిల్మ్ అవార్డు ఏమీ లేనప్పటికీ, అలా చేసిన సినీ ప్రముఖులు దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్ధన్‌ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. సృజన పట్ల, మతం పట్ల అసహనం ప్రదర్శిస్తున్నామంటే  దేశం వేసిన ప్రతి ముందడుగు మనం వెనక్కి లాగుతున్నట్లేనన్నారు. దీంతో షారుక్ వ్యాఖ్యలను సాద్వీ ప్రాచీ తీవ్రంగా ఖండించారు.

మరిన్ని వార్తలు