ఎంజీఆర్‌, పెరియార్‌ విగ్రహాలపై కాషాయ వస్త్రాలు

15 Mar, 2018 20:08 IST|Sakshi

సాక్షి, చెన్నై : విగ్రహాల విధ్వంసం ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ సీఎంలు ఎంజీఆర్‌, అన్నాదురై, ద్రవిడ కజగం వ్యవస్ధాపకులు పెరియార్‌ విగ్రహాలకు కాషాయ  వస్త్రాలను కట్టడం కలకలం రేపింది. నమక్కల్‌లో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అస్సాంలోని కోక్రాజర్‌ పట్టణంలో జన్‌సంఘ్‌ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ విగ్రహం ధ్వంసం చేసిన మరుసటి రోజు ఈ ఉదంతం వెలుగుచూడటం గమనార్హం.

బుధవారం ఉదయం కొందరు దుండగులు ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో కోక్రాజర్‌ డిప్యూటీ కమిషనర్‌ నిరంజన్‌ బారువా పోలీసు అధికారులతో కలిసి ఘటనా స్ధలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ నెల 7న కోల్‌కతాలోనూ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. త్రిపురలో లెనిన్‌ విగ్రహాన్ని కూల్చినందుకు నిరసనగా తాము ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశామని నిందితులు స్వయంగా వెల్లడించారు. మరోవైపు బీఆర్‌ అంబేద్కర్‌, నేతాజీ సుభాష్‌ చం‍ద్ర బోస్‌ విగ్రహాలనూ ఇటీవల ధ్వంసం చేసిన ఘటనలు వెలుగుచూడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు