నా రంగు కాషాయమైతే కాదు

2 Sep, 2017 07:58 IST|Sakshi
నా రంగు కాషాయమైతే కాదు

► కమల్‌ హాసన్‌ వెల్లడి
► కేరళ సీఎం విజయన్‌తో భేటీ


తమిళ సినిమా(చెన్నై)/ తిరువనంతపురం : రాజకీయ అరంగేట్రంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌(52) బీజేపీతో జట్టుకట్టేది లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఆయన అధికారిక నివాసం క్లిఫ్‌ హౌస్‌లో కమల్‌ కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై విజయన్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు.

విజయన్‌తో మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు కమల్‌ హాసన్‌ తెలిపారు. తమిళనాడులో బీజేపీతో జట్టు కట్టనున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ గత 40 ఏళ్లుగా నేను సినిమాల్లో పనిచేస్తున్నాను. ఒక విషయమైతే నేను స్పష్టంగా చెప్పగలను. నా రంగు కాషాయం(బీజేపీ) మాత్రం కాదు’ అని పేర్కొన్నారు. వామపక్ష నాయకులను తన హీరోలుగా అభివర్ణించిన కమల్‌..తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కమల్‌ డిమాండ్‌ చేశారు. విజయన్‌ నేతృత్వంలో కేరళ అభివృద్ధిలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడుతోందని ప్రశంసించారు. తన కేరళ పర్యటనను రాజకీయ వైజ్ఞానిక యాత్రగా కమల్‌ హాసన్‌ అభివర్ణించారు. మరోవైపు ఈ భేటీపై విజయన్‌ ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ.. కమల్‌తో తనకు చాలాకాలంగా మంచి స్నేహం ఉన్నట్లు తెలిపారు. కేరళకు వచ్చిన ప్రతిసారీ కమల్‌ హాసన్‌ తనను కలుసుకుంటారని, అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలుసుకోవడం ఇదే తొలిసారని విజయన్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు