న్యూయార్క్‌ ప్లాజా అమ్మకానికి భారీ డీల్‌!

7 May, 2018 20:47 IST|Sakshi

న్యూయార్క్‌ : సహారా గ్రూప్‌కి చెందిన ప్రఖ్యాత ప్లాజా హోటల్‌ను ఎట్టకేలకు ఇద్దరు వ్యాపారవేత్తలు కొనుగోలు చేశారు. న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో సుబ్రతా రాయ్‌కి చెందిన సహారా గ్రూప్‌కు 70 శాతం వాటాలు ఉన్నాయి. చాలా కాలంగా సహారా సంస్థ ఈ హోటల్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు దుబాయ్‌కు చెందిన వ్యాపార వేత్తలు దీన్ని కొనుగోలు చేశారు. ఈ డీల్‌ విలువ దాదాపు 600 మిలియన్‌ డాలర్లు. దుబాయ్‌ కేంద్రంగా పనిచేస్తున్న వైట్‌ సిటీ వెంచర్స్‌ యజమాని షాహల్‌ ఖాన్‌, హకీమ్‌ సంస్థ యజమాని కమ్రాన్‌ హకీమ్‌ 70 శాతం వాటాలను సొంతం చేసుకున్నారు. ఈ డీల్‌ జూన్‌ 25తో ముగుస్తుంది. 1907లో ఈ హోటల్‌ ప్రారంభమైంది.

అమెరికాలో ఈ ఒక్క హోటల్‌కే ‘నేషనల్‌ రిజిస్టార్‌ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్‌’లో చోటు దక్కింది. 70 శాతం వాటాను సహారా గ్రూప్‌ కార్పొరేట్‌ పైనాన్స్‌ హెడ్‌ సందీప్‌ వాద్వావ, 5 శాతం వాటాను ఛత్వల్‌లు 2012లో కొనుగోలు చేశారు. అయితే సహారా చాలా కాలంగా ఈ హోటల్‌ అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నా.. మిగతా 25 శాతం వాటాను కలిగి ఉన్న దుబాయ్‌ యువరాజు అల్వలీద్‌ బిన్‌ తాలీల్‌ వల్ల కుదరలేదు. అయితే గత ఏడాది ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ జానిస్ లాంగ్‌ లాసల్లే హోటల్‌ను వేలం వేసే బాధ్యతను తీసుకుంది. దాంతో 75 శాతం వాటాను విక్రయించినట్లు సందీప్‌, ఛత్వల్‌లు ప్రకటించారు. ఈ విక్రయ ఒప్పంద వ్యవహారం చాలా రహాస్యంగా సాగినట్టు తెలుస్తోంది. అయితే ఈ హోటల్‌ను 2005లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొనుగోలు చేసి దివాలా తీశారు. మొత్తానికి భారీ ఒప్పందంతో సహారా గ్రూప్‌ ఊపిరి పీల్చుకుంది.

మరిన్ని వార్తలు