మరో అథ్లెట్ ఆత్మహత్యాయత్నం

10 Jun, 2015 11:11 IST|Sakshi

తిరువనంతపురం: మొన్నటికి మొన్న మహిళా అథ్లెట్ ఆత్మహత్య సంఘటన మరిచిపోకముందే  కేరళలో మరో యువ క్రీడాకారుడి ఆత్మహత్యాయత్నం క్రీడావర్గాల్లో  కలకలం రేపింది.  పోలీసులు అందించిన వివరాల ప్రకారం  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో  బుధవారం  తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. శిక్షణలో ఉన్న 18 ఏళ్ల అథ్లెట్ చేతి మణికట్టును కోసుకొని ఆత్మహత్యకు  ప్రయత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు పారిపోయాడు.  చేతికి గాయం చేసుకొని పడి ఉన్న అతడ్ని గమనించి మెడికల్  కాలేజీకి తరలించారు. గాయానికి  కుట్టు వేసిన వైద్యులు అతనికి ప్రాణాపాయం లేదని తేల్చారు. కానీ మానసిక వైద్య  విభాగానికి  రెఫర్ చేశారు. ఇంతలోనే అతడు కనిపించాకుండా పోయాడని  పోలీసులంటున్నారు.  


అయితే  హాస్టల్లో దొంగతనం చేయడంతో  సహచరులు అతడిని ప్రశ్నించారని, దీంతో క్షణికావేశంతో ఆత్మహత్యకు ప్రయత్నించి..పారిపోయి ఉంటాడని  పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా గత నెలలో విషపూరితమైన పళ్లు తిని  నలుగురు మహిళా అథ్లెట్లు ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది.  కోచ్ వేధింపుల వల్లే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు