సాయిబాబాను విడుదల చేయాలి:వసంత

15 May, 2014 01:54 IST|Sakshi
సాయిబాబాను విడుదల చేయాలి:వసంత

భార్య వసంత డిమాండ్
ఆయన ఆమరణ దీక్షకు సన్నద్ధమతున్నారని వెల్లడి

 
 సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఆయన భార్య వసంత డిమాండ్ చేశారు. ఢి ల్లీ యూనివర్సిటీ అధ్యాపక బృందం నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 90 శాతం వికలాంగుడైన తన భర్తను కనీస సదుపాయాలు లేని నాగ్‌పూర్ జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ముందునుంచీ తమ కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు.
 
  ‘నాగ్‌పూర్ జైలులో ఉన్న నా భర్తను ఆయన సోదరుడు రాందేవుడు కలిశారు. వెలుతురు లేని చిన్నసైజు సెల్‌లో ఆయనను ఉంచారు. మిగిలిన ఖైదీలతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా పెట్టారు. వీల్ చైర్‌లోఉండే ఆయన అక్కడి సంప్రదాయ మరుగుదొడ్లను ఉపయోగించడం చాలా కష్టం. ఆయన హార్ట్‌పేషెంట్, హైబీపీ ఉంది. వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఎక్కువ సేపు కుర్చీలోనూ కూర్చోలేరు. కనీసం మందులు కూడా ఇవ్వట్లేదు. పోలీసులు ఇలాగే తనను ఇబ్బందిపెడితే గురువారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన రాందేవుడికి చెప్పారు’ అని వసంత అన్నారు. ఢిల్లీ వర్సిటీలో అడ్మిషన్ల అవకతవకలపై నిలదీసినందుకు వర్సిటీ పరిపాలన విభాగం సైతం తమపై కక్ష కట్టిందన్నారు.
 
 సాయిబాబాను విచారించనున్న రాష్ట్ర ఎస్‌ఐబీ
 మహారాష్ట్ర పోలీసుల అదుపులోఉన్న రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ జాతీయ సహాయ కార్యదర్శి సాయిబాబాను విచారించడానికి రాష్ట్ర యాంటీ నక్సలైట్ నిఘా విభాగం ఎస్‌ఐబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనను రాష్ట్రానికి తీసుకొచ్చి విచారించడమా, లేక మహారాష్ట్ర వెళ్లి విచారించాలా అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఆయనపై రాష్ట్రంలో కేసులు లేనందున అక్కడికే వెళ్లి విచారించడమే మేలని వారు భావిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు