ముషార్రఫ్‌ వైఖరి సరైనదే: కాంగ్రెస్‌ నేత

22 Jun, 2018 16:56 IST|Sakshi


న్యూఢిల్లీ : కశ్మీర్‌ స్వాతంత్ర్యంపై పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ వైఖరికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సైఫుద్దీన్‌ సోజ్‌ మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌ ప్రజలు పాకిస్తాన్‌లో కలవడానికి ఇష్టపడటం లేదు.. వారు కోరుకునేది స్వాతంత్ర్యమేనని ముషార్రఫ్‌ అన్నారు. నేను కూడా తొలి నుంచి అదే చెబుతున్నాను. ఈ విషయాన్ని 2007లో ముషార్రఫ్‌ పాక్‌ మిలటరీ అధికారులతోను అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మంత్రివర్గంలోని కొందరితో పంచుకున్నారు. కానీ అది సాధ్యపడదనే విషయం నాకు తెలుసున’ని తెలిపారు.

సోజ్‌ రచించిన ‘గ్లిమ్‌ప్సెస్‌ ఆఫ్‌ హిస్టరీ అండ్‌ స్టోరీ ఆఫ్‌ స్ట్రగుల్‌’ పుస్తకం ఈ నెల 25 విడుదల కానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన పుస్తకం గురించి మాట్లాడుతూ.. కార్గిల్‌ యుద్దంలో ఓడిన తర్వాత.. తన లక్ష్యాన్ని చేధించడంలో ముషార్రఫ్‌ విఫలమయ్యారని తెలిపారు. ఆ తర్వాత కశ్మీర్‌ ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నట్టు పాకిస్తాన్‌ ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారని అన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కాలంలో జరిగిన లాహోర్‌ డిక్లరేషన్‌తో కశ్మీర్‌ ప్రజల ఆశలు చిగురించాయని పేర్కొన్నారు.

కాగా, సోజ్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర మాట్లాడుతూ.. సైఫుద్దీన్‌ లాంటి నాయకుడు ఈ విధంగా మాట్లాడటం బాధ కలిగించిదన్నారు. భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గులాం నబీ ఆజాద్‌ కూడా భారత ఆర్మీని అప్రతిష్టపాలు చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన కూడా సోజ్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

>
మరిన్ని వార్తలు