అమ్మాయిలకు తొలిసారి...

24 Apr, 2018 11:36 IST|Sakshi
సైనిక పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థినులు

లక్నో : ఇన్నాళ్లు సైనిక పాఠశాలలో కేవలం మగపిల్లలను మాత్రమే తీసుకునేవారు. ఈ సైనిక పాఠశాలలు ప్రారంభమైన 57 సంవత్సరాల తర్వాత తొలిసారి సైనిక పాఠశాల్లో ఆడపిల్లలకు అవకాశం కల్పించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం 2018 - 2019 విద్యాసంవత్సరానికి గాను లక్నోలోని కెప్టెన్‌ మనోజ్‌ కుమార్‌ పాండే సైనిక పాఠశాలలో 15 మంది విద్యార్థినులకు ప్రవేశం కల్పించారు. వీరందరూ రైతులు, వైద్యులు, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు వంటి వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చారు. సైనిక పాఠశాలలో ప్రవేశం పొందడానికి మొత్తం 2500 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్ష, ఇంటర్యూ తర్వాత 15 మంది విద్యార్థినులను ఎంపిక చేసారు.

‘ఇక్కడ అందరికి ఒకే రకమైన దినచర్య ఉంటుంది. ఉదయం 6 గంటలకు వ్యాయామం, తర్వాత 8.15 గంటలకు ప్రార్థనకు హాజరుకావాల్సి ఉంటుంది. తరగతులు అయిపోయిన తర్వాత వారు హాస్టల్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7 గంటల వరకు వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటారు. తర్వాత చదువుకుంటారు. ప్రతిష్టాత్మక సైనిక పాఠశాలలో చేరినందుకు వారంతా చాలా గర్వపడుతున్నారు. సైనిక పాఠశాలలో ఇప్పుడు ప్రవేశం పొం‍దిన అమ్మాయిలు తొమ్మిదో తరగతిలో చేరతారు. 2017లో యూపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈసారి సైనిక పాఠశాలలో విద్యార్థినులకు ప్రవేశం కల్పించాం. వీరికి వసతి ఏర్పాట్లు కోసం నూతన భవనాన్ని ఏర్పాటు చేయలేదు. ఇంతకు ముందు అబ్బాయిలకు కేటాయించిన హాస్టల్‌ని ఇప్పుడు అమ్మాయిల కోసం వాడనున్నామ’ని పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు కల్నల్‌ అమిత్‌ ఛటర్జీ తెలిపారు.

మరిన్ని వార్తలు