‘ఎక్సో’లెంట్‌ వైద్యం!

1 Feb, 2018 03:52 IST|Sakshi

శరీరంలోని ఎక్సోసోమ్‌లతో సరికొత్త వైద్యం 

నేరుగా మందులను అవయవాలకు పంపే అవకాశం 

పూర్తి వివరాలు తెలిస్తే కేన్సర్‌ వంటి వ్యాధులకు చికిత్స 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో శాస్త్రవేత్త కల్లూరి రఘు 

మన శరీరంలో కోట్ల సంఖ్యలో ఉండే కణాల్లో డీఎన్‌ఏ, జన్యువులు ఉంటాయని తెలిసిందే. మరి ఎక్సోసోమ్స్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక్కొక్కరిలో కనీసం వెయ్యి లక్షల కోట్ల వరకు ఉండే అతిసూక్ష్మమైన కొవ్వు తిత్తులివి. వీటివల్ల కలిగే ప్రయోజనం మాత్రం ఇప్పటికీ మిస్టరీనే! ఈ విషయాన్ని ఛేదిస్తే కేన్సర్‌ సహా అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స లభిస్తుంది. ఇదే లక్ష్యంగా ఎక్సోసోమ్‌లపై ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్త రఘు కల్లూరి. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆన్‌ సెల్‌ బయాలజీ’కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ఆయన పరిశోధనల వివరాలను పంచుకున్నారు. 

ప్రశ్న: ఎక్సోసోమ్‌ల గురించి వివరిస్తారా? 
రఘు: కణాలన్నీ విడుదల చేసే అతిసూక్ష్మమైన తిత్తుల్లాంటి నిర్మాణాలు ఇవి. సుమారు 30 ఏళ్ల కిందే వీటిని గుర్తించారు. తొలుత ఇవి కణవ్యర్థాలే అని భావించేవారు. గత పదేళ్లలో ఎక్సోసోమ్‌లకు సంబంధించి వివరాలు అర్థమవుతున్న కొద్దీ వీటిపై ఆసక్తి పెరుగుతోంది. ఇవి కొన్నిసార్లు ఇతర కణాల్లోకి చొచ్చుకుపోగలవని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. వీటి ఆధారంగా ఎక్సోసోమ్‌లు వేర్వేరు కణాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉపయోగపడతాయని అంచనా. వీటిని నియంత్రించగలిగితే వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. 

ప్ర: వ్యాధులకు, వీటికి సంబంధం ఏంటి?  
రఘు:అన్ని ఎక్సోసోమ్‌లు ఒకేలా ఉండవు. కణాల స్థితికి అనుగుణంగా డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలు మారిపోతుంటాయి. కేన్సర్‌ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారి రక్తాన్ని పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. అందుకే ఇవి భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణకు సాధనంగా వాడుకోవచ్చని భావిస్తున్నాం. ఇతర కణాల్లోకి సులువుగా చొచ్చుకుపోగలవు కాబట్టి శరీరంలోని వివిధ భాగాలకు మందులు నేరుగా చేరవేయొచ్చు. నేను పనిచేస్తున్న ఎండీ యాండర్సన్‌ కేన్సర్‌ సెంటర్‌ ఎక్సోసోమ్‌లలోకి మందులు చేర్చడంలో ఇప్పటికే విజయం సాధించింది. 

ప్ర: ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? 
రఘు:రక్తం నుంచి ఎక్సోసోమ్‌లను వేరు చేసి.. వ్యక్తుల తాలూకూ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చు. డీఎన్‌ఏ మార్పులు, ప్రొటీన్లను విశ్లేషించే అవకాశం ఉంటుంది. దీంతో కచ్చితమైన వైద్యం సాధ్యమవుతుంది. జన్యుమార్పులన్నింటినీ గుర్తించి కేన్సర్‌ చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయొచ్చు. మధుమేహం, నాడీ సంబంధిత వ్యాధులను కూడా గుర్తించే అవకాశముంది. 

ప్ర: మీరు కోడియాక్‌ అనే సంస్థను స్థాపించారు. అందులో ఏ రకమైన పరిశోధనలు జరుగుతున్నాయి? 
రఘు:కేన్సర్‌ తీరుతెన్నులు, అవయవాలకు విస్తరించే తీరు తదితరాలపై పరిశోధనలు చేస్తున్నాం. ఎక్సోసోమ్‌లను పూర్తిస్థాయిలో అర్థం చేసుకునేందుకు తద్వారా సరికొత్త చికిత్స విధానాలను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 

ప్ర: కడుపు, పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు కూడా ఎక్సోసోమ్‌లను విడుదల చేస్తూంటాయా? 
రఘు:విడుదల చేసే అవకాశం ఉంది. మన కణాలు విడుదల చేసేవి బ్యాక్టీరియాలోకి.. అలాగే బ్యాక్టీరియా ఎక్సోసోమ్‌లు మన కణాల్లోకి ప్రవేశిస్తుండవచ్చు. జీవశాస్త్రంలో ఎక్సోసోమ్‌లు తాజా సంచలనం. ప్రస్తుత పరిశోధనలను, ఎప్పటికప్పుడు మెరుగవుతున్న టెక్నాలజీలను దృష్టిలో పెట్టుకుంటే వచ్చే ఐదేళ్లలో ఎక్సోసోమ్‌ల ద్వారా వ్యాధుల నిర్ధారణ గానీ.. చికిత్స గానీ పూర్తిస్థాయిలో సాధ్యమవుతుంది. 

ప్ర: ఇవి సాధారణ రసాయనాలకు స్పందిస్తాయా? హోమియో వంటి వైద్యవిధానాలు సూక్ష్మస్థాయి రసాయనాలపైనే ఆధారపడి ఉంటాయి కదా? వాటి ప్రభావం ఏంటి? 
రఘు: హోమియో మందులు ఎక్సోపోమ్‌లపై ప్రభావం చూపుతాయని భావిస్తు న్నాను. ఆయుర్వేద మందులు మొక్కల నుంచి తయారవుతాయి కాబట్టి మొక్క ల ఎక్సోసోమ్‌లు కచ్చితంగా మన ఎక్సోసోమ్‌లపై ప్రభావం చూపుతాయి. 
– సాక్షి హైదరాబాద్‌   

మరిన్ని వార్తలు