సామాన్యుడికి చేరువ కావాలి అదే మా లక్ష్యం

1 Nov, 2018 03:09 IST|Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌

కాపలా లేని రైల్వే లెవల్‌ క్రాసింగులు నిర్మూలించాం

ఆదాయాభివృద్ధి పెరుగుదలలో దేశంలోనే నం.1

ఎంఎంటీఎస్‌–2 పూర్తి, బోగీల కొనుగోలే తరువాయి

శివారు స్టేషన్ల అభివృద్ధి, టెర్మినళ్ల నిర్మాణానికి చర్యలు 

రూ.400 కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. సామాన్యుడికి రైల్వే సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే, దక్షిణమధ్య రైల్వే పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల భద్రత, కొత్తలైన్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలివీ... 

సాక్షి: దక్షిణ మధ్య రైల్వే పురోగతి ఎలా ఉంది? 
జీఎం: బావుంది. ఆదాయ పెరుగుదలతో దక్షిణమధ్య రైల్వే ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో రూ.7,017 కోట్లు ఆర్జించింది. 2016లో ఇది రూ.6,171గా ఉంది. అంటే 13.71 శాతం పెరుగుదల నమోదైంది. ఆదాయాభివృద్ధి పెరుగుదలలో దేశంలోనే మొదటిస్థానం సాధించాం. ఇక సరుకు రవాణా ఆదాయంలో దేశంలో 5వ స్థానంలో నిలిచాం. 

భారతీయ రైల్వే చేపట్టిన అంబ్రెల్లా ప్రాజెక్టుల గురించి వివరిస్తారా? 
దీని కింద ప్రతీ జోన్‌లో ఉన్న జీఎంకు రూ.100 కోట్ల నిధులొస్తాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా, ప్రాధాన్యం మేరకు స్టేషన్లలో వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని వెచ్చించవచ్చు. ముఖ్యంగా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, హైలెవెల్‌ ప్లాట్‌ఫారమ్స్‌ ఏర్పా టు చేస్తున్నాం. రాబోయే రెండు మూడేళ్లలో జోన్‌ పరిధిలో ఉన్న 742 స్టేషన్లలో ఈ పనులు పూర్తవుతాయి. 

మాసాయిపేట దుర్ఘటన తరువాత కాపలా లేని రైల్వే లెవల్‌ క్రాసింగుల నిర్మూలిస్తామన్నారు కదా! ఆ పనులు పూర్తయ్యాయా? 
కాపలా లేని రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ పనులు అక్టోబర్‌ 31 గడువుగా పెట్టుకుని పూర్తిచేశాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పుడు కాపలా లేని రైల్వే లెవల్‌ క్రాసింగులు లేవు. 2018 చివరి నాటికి దేశవ్యాప్తంగా కాపలా లేని రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల నిర్మూలన దిశగా భారతీయ రైల్వే కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. 

ఆర్వోబీ/ఆర్‌యూబీల పనుల పురోగతి? 
గత నాలుగేళ్లలో 379 ఆర్వోబీ/ఆర్‌యూబీలను పూర్తి చేశాం. మిగిలిన 264 ఆర్వోబీ/ఆర్‌యూబీ ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నాం. 

ఎంఎంటీఎస్‌ ఫేజ్‌–2 పనులు ఎంతవరకు వచ్చాయి? 
ఎంఎంటీఎస్‌ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రేక్స్‌(నాలుగు బోగీలు కలిగిన రైళ్లు) కొనుగోలు మాత్రమే మిగిలింది. అవి రాగానే సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. 

ఎంఎంటీఎస్‌ ఫేజ్‌–2ని యాదాద్రి వరకు పొడిగిస్తారా? 
ఈ ప్రాజెక్టు చేపట్టడానికి మేం సుముఖమే. సర్వే కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

కరీంనగర్‌–హసన్‌పర్తి కొత్త లైన్‌ సర్వే పనులు ఎలా ఉన్నాయి? 
ఉత్తర తెలంగాణను ఉత్తర భారతంతో కలిపే ప్రాజెక్టు ఇది. దీని సర్వే పనులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి సర్వే పూర్తవుతుంది.

శివారు స్టేషన్ల అభివృద్ధి, టెర్మినళ్ల నిర్మాణానికి ఏం చర్యలు తీసుకున్నారు? 
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై రద్దీ పెరిగిన నేపథ్యంలో లింగంపల్లి స్టేషన్‌ని నాలుగో టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం 5 రైళ్లను అక్కడ నుంచి నడుపుతున్నాం. త్వరలోనే మరిన్ని నడుపుతాం. చర్లపల్లి టెర్మినల్‌ పనులు మొదలుపెట్టాం. అందుబాటులో ఉన్న 50 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నాం. మొత్తం రూ.224 కోట్లతో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 

కొత్త రైల్వే పనుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 
కొత్త రైల్వే పనుల కోసం భారతీయ రైల్వే ఎప్పుడూ ముందుంటుంది. ఇందుకోసం జాయింట్‌ వెంచర్‌ విధానంలో ముందుకెళుతున్నాం. రాష్ట్రాలు 51 శాతం, కేంద్రం 49 శాతం నిధులతో ప్రాజెక్టులు చేపడతాం. ఈ విధానాన్ని వినియోగించుకోవడంలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. దీనిపై ఏపీ సంతకం చేసింది. కానీ, పనులు మొదలు కాలేదు. తెలంగాణతో ఇంకా సంప్రదింపులు నడుస్తున్నాయి.

స్టేషన్ల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 
దక్షిణ మధ్య రైల్వేలోని వరంగల్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, గుంతకల్‌ స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రతీ స్టేషన్‌కు రూ.30 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. స్టేషన్ల సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. ఆయా స్టేషన్ల ముఖద్వారాల్లో స్థానిక పట్టణ విశిష్టతను తెలిపేలా చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. ఇక రూ.400 కోట్ల నిధులతో తిరుపతి స్టేషన్‌కు అభివృద్ధి పనులు చేపట్టాం
 

మరిన్ని వార్తలు