వాచ్‌: కేరళ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు

19 Aug, 2018 17:01 IST|Sakshi

కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ వర్షాలు, వరదలతో మలబారు తీరం అల్లకల్లోలంగా మారింది. ప్రకృతి అందాలకు చిరునామా అయిన మలయాళ రాష్ట్రంలో మరణమృదంగం మోగింది. ఎటుచూసినా నీరే... ఎక్కడచూసినా సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులే. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలమంది దుర్మరణం పాలయ్యారు. లక్షలాదిమంది గూడులేక నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో కేరళ ఇలాంటి జలప్రళయాన్ని కనీవినీ ఎరుగదు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నా.. ఇంకా వేలాదిమందికి సాయం అందని పరిస్థితి. జలవిలయంతో తల్లడిల్లుతున్న  కేరళ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌ ఇది..

వాచ్‌ : కేరళలో పర్యటిస్తున్న ‘సాక్షి’  బృందం

ప్రకృతి వైపరీత్యంతో కేరళలో కల్లోలం కొనసాగుతోంది. వరద బీభత్సంతో రాష్ట్రం అల్లాడిపోతోంది. ఎడతెగని వర్షాలు సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. పథనంతిట్ట, ఎర్నాకుళం జిల్లాల్లో ఇవాళ కుడా వాన పడింది. కొన్నిచోట్ల పునరావాస శిబిరాల్లోకి వరదనీరు చేరింది. జలవిలయంతో శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 33మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 350 దాటిపోయింది. 10లక్షలమంది పునరావాస శిబిరాల్లో ఉన్నారని కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్‌ తెలిపారు.  2లక్షల కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా. కాగా, కేరళలోని అన్ని జిల్లాల్లో విధించిన రెడ్అలర్ట్‌ను వాతావరణ విభాగం ఉపసంహరించుకోవడం కాస్త ఊరట కలిగించే విషయం. అల్పపీడనం ఏర్పడినా, రేపటికి వర్షాల తీవ్రత తగ్గుతుందని అధికారులు ప్రకటించడంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

ఘోరంగా నష్టపోయిన జిల్లాలు!
అలువా, చాలక్కుడి, చెంగన్నూర్‌, అలపుఝ, పథనంతిట్ట ప్రాంతాలు ఘోరంగా నష్టపోయాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కేరళలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. పాలక్కాడ్‌, ఇడుక్కి జల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. రాష్ట్రంలో సగభాగానికి విద్యుత్తు సౌకర్యం లేదు. 80శాతం గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా సమీక్ష జరిపారు. టెలికమ్మూనికేషన్స్‌ వ్యవస్థ ఘోరంగా దెబ్బతినడంతో.. అన్ని ప్రాంతాలకు సమాచార సౌకర్యాలు అందేలా సంసెల్యులార్‌ ఆన్‌ వీల్స్‌ ఏర్పాటయ్యాయి. టెలికాం కంపెనీలు శుక్రవారం నుంచే ఉచిత డాటా, ఎస్‌ఎంఎస్‌ సౌకర్యాలను ఇంట్రాసర్కిల్‌ రోమింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఛార్జీలను అదుపుచేయాలని విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది.

ముమ్మరంగా సహాయక చర్యలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌తోపాటు త్రివిధ దళాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. 42 నేవీ, 16 ఆర్మీ, 28 కోస్ట్‌గార్డ్‌, 39 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 38 హెలికాఫ్టర్లు, వందలాది బోట్లతో.. సిబ్బంది వరదల్లో చిక్కుకున్నవారికి భోజనం, నీరు, ఔషధాలు సరఫరా చేస్తున్నారు. ఇండియన్ నేవీ ‘ఆపరేషన్‌ మదద్‌’ పేరుతో సేవలు అందిస్తోంది. ఎర్నాకుళం జిల్లాకే 42 బృందాలు వెళ్లాయి. 72 మంది గజ ఈతగాళ్లు ఈ బృందాల్లో ఉన్నారు. నేవల్‌ బేస్‌లను సహాయ శిబిరాలుగా మార్చి భోజన సదుపాయాలు కల్పిస్తోంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ మూతపడడంతో.. కోచి నావల్‌ బేస్‌ నుంచి సాధారణ విమానాలు నడిపేందుకు నేవీ అవకాశం కల్పించింది. కేరళకు చెందిన 600మంది మత్స్యకారులు నిరంతరాయంగా  సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

మరిన్ని వార్తలు