ప్రియాంక ఘటనపై సల్మాన్‌ స్పందన

1 Dec, 2019 17:46 IST|Sakshi

ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక హత్యాచార ఘటనపై బాలీవుడ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఉదంతమిదని మానవతావాదులు గళం విప్పుతున్నారు. తాజాగా సల్మాన్‌ ఖాన్‌, షబనా అజ్మీ, వరుణ్‌ ధావన్‌ సహా బాలీవుడ్‌ ప్రముఖులు ఈ దారుణ ఘటనపై స్పందించారు. బేటీ బచావో కేవలం ప్రచార నినాదంగా పరిమితం కాకూడదని సల్మాన్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశారు. సమాజంలో మనిషి ముగుసువేసుకుని సైతాన్లు తిరుగుతున్నాయని, అమాయక యువతి ప్రాణాలు కోల్పోతూ ఎదుర్కొన్న వేధింపులు, బాధ మనకు కనువిప్పు కలగాలని, మన మధ్యలో తిరుగుతున్న సైతాన్లను మట్టుబెట్టేందుకు మనమంతా ఐక్యంగా ముందుకు కదలాలని పిలుపు ఇచ్చారు.

మరో మహిళ ఆమె కుటుంబానికి మరోసారి ఇలాంటి దారుణ పరిస్థితి తలెత్తకుండా వ్యవహరించాలని సల్మాన్‌ కోరారు. కామాంధుల చెరలో బలైన ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. మరోవైపు ఈ దారుణానికి ఒడిగట్టిన ద్రోహులను కఠినంగా శిక్షించాలని నటి రిచా చద్దా డిమాండ్‌ చేశారు. మహిళలపై జరుగుతున్న ఈ నేరాలను ఊహించేందుకే భయం వేస్తోందని పట్టరాని కోపం, ఆగ్రహం, దిగ్భ్రాంతి కలుగుతున్నాయని నటి యామీ గౌతమ్‌ ట్వీట్‌ చేశారు. దోషులకు మరణ శిక్ష విధించాలని ఫిల్మ్‌మేకర్‌ కునాల్‌ కోహ్లి అన్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు భద్రత కల్పించే వాతావరణం ఉండేలా చేయడం మనందరి బాధ్యతని హీరో వరుణ్‌ ధావన్‌ కోరారు. మహిళలు, బాలికలకు ఎందుకు వీరు సులభంగా హాని తలపెడుతున్నారు..? నేరస్తులకు చట్టం అంటే ఎందుకు భయం లేకుండా పోతోంది..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లైంగిక దాడులకు తెరపడేలా మనమంతా పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు