సల్మాన్ ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందా?

9 May, 2015 13:58 IST|Sakshi
సల్మాన్ ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందా?

న్యూఢిల్లీ:  విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచి మరోసారి తన  వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హిట్ రన్ కేసులో సల్మాన్ ఖాన్.. ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందంటూ  వ్యాఖ్యానించి  సంచలనానికి తెరలేపారు.  అంతేకాదు  వీధి కార్మికులకు వ్యతిరేకంగా ట్వీట్  చేసి,  సల్మాన్ఖాన్కు వత్తాసు పలికిన బాలీవుడ్ సింగర్ను  అరెస్టు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.

సల్మాన్ ముస్లిం కాకపోయి వుంటే బెయిల్ లభించేది కాదని సాధ్వి ప్రాచీ అభిప్రాయాపడ్డారు. చట్టం దృష్టిలో అందరూ సమానమని,  బాధితులైన నిరుపేదలకు  కూడా న్యాయం  జరగాలని ఆమె  సూచించారు. అలాగే మాలేగావ్  పేలుళ్ల కేసులో  జైల్లో ఉన్న సాధ్వి ప్రగ్యాను విడుదల చేయాలని  సాధ్వీ ప్రాచి డిమాండ్ చేశారు.

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను దోషిగా తేల్చిన ముంబై సెషన్స్ కోర్టు  అయిదేళ్ల జైలు శిక్ష విధించింది.   అనంతరం  రెండురోజుల తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది. అనంతరం  శుక్రవారం  సెషన్స్ కోర్టు తీర్పును నిలుపుదల చేసిన ముంబై హైకోర్టు సల్లూ భాయ్కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే సాధ్వీ ప్రాచీ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
కాగా  సాధ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటూ ఇటీవల  వ్యాఖ్యానించి వివాదం రేపారు. పైగా తానేమీ తప్పు మాట్లాడలేదనీ..30,40 మందిని కనమన్నానా అంటూ  సమర్ధించుకున్నారు. పైగా ఎక్కువమంది పిల్లల్ని కన్న హిందూ మహిళలకు అవార్డులు  ఇచ్చి సత్కరించాలని సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు