సల్మాన్ తాగాడో లేదో తెలియదు!

23 Jun, 2014 23:25 IST|Sakshi

కోర్టుకు ‘రెయిన్ బార్’ మేనేజర్ వాంగ్మూలం
ముంబై: ‘హిట్ అండ్ రన్’ కేసులో సల్మాన్‌కు ఊరటనిచ్చేలా జుహూలోని రెయిన్ బార్ మేనేజర్ కోర్టుకు వాంగ్మూలమిచ్చారు. ఘటన జరిగిన రోజు స్నేహితులతో కలిసి సల్మాన్‌ఖాన్ బార్‌కు వచ్చిన విషయం నిజమే అయినప్పటికీ వారితో కలిసి ఆయన ఆల్కహాల్ తాగాడా? లేదా? అనే విషయం కచ్చితంగా తెలియదని కోర్టుకు తెలిపాడు. జుహూలోని రెయిన్ బార్‌లో మద్యం సేవించిన సల్మాన్ ఆ మత్తులోనే కారు నడిపి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్నవారి మీదనుంచి తీసుకెళ్లాడని, ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
 
‘సల్మాన్ స్నేహితులతో కలిసివచ్చి మద్యాన్ని ఆర్డర్ చేశారు. దీంతో వెయిటర్ వారికి మద్యాన్ని అందజేశాడు. అప్పుడు సల్మాన్ మద్యం సేవించాడా? లేదా? అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేన’ని బార్ మేనేజర్ రిజ్వాన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే ధర్మాసనానికి తెలిపాడు. రెస్టారెంట్‌లో ఆ రోజు జనంతో కిటకిటలాడుతోందని, సల్మాన్, అతని సోదరుడు సోహైల్ సర్వీస్ కౌంటర్ ముందు నిలబడి స్నాక్స్, డ్రింక్స్ ఆర్డరు చేశారని, అంతలోనే వారి టేబుల్ వద్దకు అతని స్నేహితులు వచ్చి కూర్చున్నారని చెప్పాడు.

సల్మాన్ చేతిలో తాను నిండు గ్లాస్‌ను కూడా చూశానని, అయితే రంగులేని సోడా(నీళ్లలాగా)తో ఉందని చెప్పినప్పుడు అది మద్యమా? అని న్యాయవాది ప్రశ్నించాడు. దీంతో తాను కచ్చితంగా చెప్పలేనని రిజ్వాన్ సమాధానమిచ్చాడు. సల్మాన్ బృందం బయటకు వెళ్లేముందు కూడా తాను ప్రధాన ద్వారం వరకు వచ్చానని చెప్పాడు. ఆ సమయంలో సల్మాన్ నుంచి ఎటువంటి మద్యం వాసన రాలేదని, అతను మత్తులో ఉన్నట్లుగా కూడా కనిపించలేదని, మామూలుగానే నడుచుకుంటూ వెళ్లిపోయాడని రిజ్వాన్ కోర్టుకు తెలిపాడు. ఆ రోజు సల్మాన్ డబ్బులు చెల్లించిన బిల్లులను కోర్టుకు చూపాడు.
 
ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది రిజ్వాన్ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు.. ఆ రోజు సర్వీస్ కౌంటర్‌లో ఎవరున్నారో చెబుతారా? అని ప్రశ్నించగా.. బార్‌లో వెలుతురు తక్కువగా ఉన్న కారణంగా ఆ సమయంలో సర్వీస్ కౌంటర్‌పై ఎవరున్నారనే విషయాన్ని తాను చెప్పలేనన్నాడు. అంతకు ముందు వెయిటర్ కూడా దాదాపుఇదే రకమైన సమాధానమిచ్చాడు. సల్మాన్ మద్యం సేవించడాన్ని తాను చూడలేదని కోర్టుకు తెలిపాడు.
 
మరో ప్రత్యక్ష సాక్షి రామశ్రీ పాండేను కూడా ప్రాసిక్యూషన్ విచారించింది. ప్రమాదం జరిగిన అమెరికన్ బేకరీకి సమీపంలోనే పాండే దుకాణం కూడా ఉంది. ‘ప్రమాదం జరిగిందంటూ అరుపులు వినపడగానే నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్లాను. అప్పటికే అక్కడ సుమారు 50-60 మంది గుమిగూడారు. కొందరు కారు డోరును తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటికే అది జామ్ అయింది. బాధితుల కేకలు వినిపించాయి. మరికొద్ది సేపటికి కోపంతో కొందరు కారువైపు రాళ్లు రువ్వారు. ఆ సమయంలో కారు ముందుభాగం కిందివైపు సల్మాన్ కనిపించాడు. అతని బాడీగార్డ్ మాత్రం బయట కనిపించాడు. వీరు మినహా ఘటనాస్థలంలో మరెవరూ కనిపించలేద ’ని కోర్టుకు తెలిపాడు.

>
మరిన్ని వార్తలు