సల్మాన్ ఖాన్ నేరం చేశాడు

6 May, 2015 11:27 IST|Sakshi
సల్మాన్ ఖాన్ నేరం చేశాడు

ముంబయి: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది.  సుదీర్ఘ విచారణానంతరం హిట్ అండ్ రన్ కేసులో ఆయన దోషి అని నిర్దారించింది.. బుధవారం ఉదయం ముంబై సెషన్స్ కోర్టు ఆయనపై నమోదైన అభియోగాలు అన్ని కూడా నిజమే అని స్పష్టం చేసింది.  ఆరోజు సల్మాన్ మద్యం తాగి కారునడిపారని, ఘటనకు ఆయన కారణం అని స్పష్టం చేసింది.

సల్మాన్ నేరం చేసినట్టు కోర్టులో రుజువు కావడంతో ఆయనకు ఇక జైలు శిక్ష ఖరారు కానుంది. సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే శిక్ష కాలాన్ని ప్రకటించనున్నారు. కుటుంబసభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ తీర్పు.. సల్మాన్కు ప్రతికూలంగా రావడంతో అందరిలో కాస్తంత నిరాశ కలిగించింది. అయితే ఈ కేసుపై సల్మాన్ హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.

2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ మద్యం మత్తులో కారు నడపడం వల్ల రోడ్డు పక్కన ఉండే ఫుట్ పాత్పై పడుకున్న వారిపై వాహనం దూసుకెళ్లినట్టు కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. తొలుత బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును విచారించింది.  అనంతరం విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో పలువురిని ప్రశ్నించి, సాక్ష్యాలు నమోదు చేశారు.

కాగా, ఈ రోజు ఉదయం కోర్టు తీర్పుకు ముందు సల్మాన్ ఖాన్ బాంద్రాలోని తన నివాసం నుంచి కుటుంబ సభ్యులతో కలసి ముంబై సెషన్స్ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆవరణలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. లాయర్లు, మీడియా, కోర్టు సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించారు. సల్మాన్కు శిక్ష ఖరారు చేస్తున్నట్టు ప్రకటించగానే కుటుంబ సభ్యులు విలపించారు. సల్మాన్ విచారణ వదనంతో కనిపించారు. బాలీవుడ్ నిర్మాతలు తీవ్ర ఆందోళన చెందారు. సల్మాన్ హీరోగా పలు సినిమాలు నిర్మితమవుతున్నాయి. రూ. 200 కోట్ల ప్రాజెక్టులు ఆయనపై ఆధారపడి ఉన్నాయి. సల్మాన్ జైలుకెళితే ఆ ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది.

మరిన్ని వార్తలు