కోర్టుకు హాజరుకాని సల్మాన్‌

27 Sep, 2019 16:12 IST|Sakshi

జోధ్‌పూర్‌ : బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ శుక్రవారం కోర్టుకు గైర్హాజరయ్యారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్‌ కోర్టు ముందు ఆయన నేడు హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్‌ మాత్రం కోర్టుకు రాలేదు. సల్మాన్‌ గైర్హాజరు గల కారణాలను అతని లాయర్లు కోర్టుకు వివరించారు. సల్మాన్‌ను చంపేస్తామంటూ సోషల్‌ మీడియాలో బెదిరింపులు వచ్చిన విషయాన్ని వారు కోర్టుకు తెలిపారు. సల్మాన్‌ కోర్టుకు హాజరయ్యే సమయంలో అక్కడి పరసరాల్లో శాంతి భద్రతలను అదుపులో ఉంచాలని కోరారు. దీంతో కోర్టు విచారణను  డిసెంబర్‌ 19కి వాయిదా వేశారు. 

1998లో ‘హ‌మ్ సాథ్ సాథ్ హై’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ రోజు రాత్రి సల్మాన్‌తో పాటు మరికొందరు నటులు జోద్‌పూర్‌ పరిసరాల్లోని అడవిలో కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పట్లోనే సల్మాన్‌తో పాటు మరికొందరు నటులపై జోద్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సల్మాన్‌ ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ గతేడాది ఎప్రిల్‌లో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టు తీర్పును సవాలు చేసి బెయిల్‌ పొందారు. ఆ సమయంలో సల్మాన్‌ రెండు రోజుల పాటు జోధ్‌పూర్‌ జైలులో ఉన్నారు. అయితే బెయిల్‌ పొందినప్పటి నుంచి సల్మాన్‌ న్యాయస్థానం ముందు హాజరు కాలేదు. కాగా, ఈ ఏడాది జూలై 4వ తేదీన కేసు విచారణ సమయంలో.. సల్మాన్‌ సెప్టెంబర్‌ 27వ తేదీన కోర్టుకు హాజరు కాని పక్షంలో బెయిల్‌ను రద్దు చేస్తామని జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు