సల్మాన్‌ ఖుర్షీద్‌ సంచలన వ్యాఖ్యలు

9 Oct, 2019 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పరాజయ భారంతో కాంగ్రెస్‌ చీఫ్‌గా రాహుల్‌ గాందీ వైదొలగడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని ఆ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. రాహుల్‌ నిష్క్రమణతో పార్టీలో గ్యాప్‌ నెలకొందని, దీంతో పార్టీ దిక్కుతోచని స్ధితిలో పడిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీ ఈ దశలో ఎందుకు ఉన్నదనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాహుల్‌ను పార్టీ చీఫ్‌గా కొనసాగాలని తాము ఎన్నిరకాలుగా విజ్ఞప్తి చేసినా పదవి నుంచి వైదొలగేందుకే ఆయన నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు. పార్టీలో నేడున్న పరిస్థితుల దృష్ట్యా హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం సంక్లిష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాట అటుంచి పార్టీ భవితవ్యమే ప్రశ్నార్థకంలో పడిందని వ్యాఖ్యానించారు. అక్టోబర్‌ 21న హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఖుర్షీద్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తాము ఎందుకు ఓటమి పాలయ్యామో తెలుసుకునేందుకు తాము సరైన విశ్లేషణే చేయలేదని చెప్పుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు